Revanth Reddy: హైకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట

Revanth Reddy gets relief in High Court Telangana
  • ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం
  • గత ఏడాది ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఫిర్యాదు
  • కేసును కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించిన ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఒక కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఏం జరిగింది?

గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు అనుకూలంగా నేడు తీర్పు వెలువడింది.
Revanth Reddy
Telangana CM
High Court
Defamation case
Kasam Venkateswarlu
Bhadradri Kothagudem

More Telugu News