India vs England: ఐదో టెస్టు.. బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్‌.. ఆదుకున్న కరుణ్‌

Karun Nairs unbeaten half century takes India to 2046 at stumps
  • ఓవల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌, భార‌త్ ఐదో టెస్టు
  • టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా త‌డ‌బాటు
  • తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో 204/6
  • అజేయ అర్ధ శ‌త‌కంతో (52 నాటౌట్) ఆదుకున్న కరుణ్‌
  • కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే గిల్‌ అరుదైన ఘనత
ఓవల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆట ముగిసే స‌మ‌యానికి  6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తూ తడబ‌డింది. టాస్‌ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లాండ్ పేసర్లు కట్టడిచేయడంతో భార‌త కీల‌క బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో తొలి రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కరుణ్‌ నాయర్‌ (52 నాటౌట్‌), సాయి సుదర్శన్‌ (38) భారత్‌ను ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్‌ అట్కిన్సన్‌ (2/31) జోష్‌ టంగ్‌ (2/47) చెరో రెండు వికెట్లు తీయగా.. వోక్స్‌ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఆదుకున్న కరుణ్‌
మొద‌టి మూడు టెస్టుల్లో విఫ‌ల‌మైన క‌రుణ్ నాయ‌ర్‌.. నాలుగో టెస్టుకు దూర‌మైన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అత‌డు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మొదట సాయితో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్న క‌రుణ్.. వాషింగ్టన్‌ (19 నాటౌట్‌)తో అజేయమైన ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. మాంచెస్టర్‌ సెంచరీ హీరో వాషింగ్టన్‌, కరుణ్‌.. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి తొలి రోజును ముగించారు.

గిల్‌ అరుదైన ఘనత
కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్‌లోనే గిల్‌ దిగ్గజాల సరసన నిలిచాడు. ఈ సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా ఉన్న భారత సారథి (743).. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సునీల్‌ గవాస్కర్‌ (1978/79లో వెస్టిండీస్‌తో 732 ప‌రుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ (2016/17లో ఇంగ్లండ్‌ పై 655 ర‌న్స్‌) మూడో స్థానంలో ఉన్నాడు.
India vs England
Karun Nair
5th Test
Oval Test
Sai Sudarshan
Washington Sundar
Gus Atkinson
Josh Tongue
Sunil Gavaskar
Virat Kohli

More Telugu News