Kerala Government: ఆ రాష్ట్రంలో త్వరలో మద్యం బాటిల్‌పై రూ.20 డిపాజిట్ చేయాలి.. ఎందుకంటే?

Kerala Government to Impose 20 Deposit on Liquor Bottles
  • మద్యం బాటిళ్ల విషయంలో కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం
  • మద్యం బాటిల్‌పై అదనంగా రూ. 20 ముందస్తు డిపాజిట్
  • ఖాళీ బాటిల్ ను అవుట్‌లెట్‌లో అప్పగిస్తే డబ్బు వెనక్కి
కేరళ ప్రభుత్వం మద్యం బాటిళ్ల విషయంలో ఒక నూతన నిర్ణయం తీసుకుంది. ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ. 20 ముందస్తు డిపాజిట్ చేయించుకొని, ఆ బాటిల్‌ను తిరిగి అదే అవుట్‌లెట్‌లో డిపాజిట్ చేస్తే, ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. త్వరలో దీనిని అమలు చేయనున్నారు. మద్యం సేవించిన అనంతరం బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారవేయడం వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 70 కోట్ల సీసాల మద్యం విక్రయాలు జరుగుతున్నాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అయితే, మొత్తం అమ్ముడవుతున్న మద్యం బాటిళ్లలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి, మిగిలినవి వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ వెల్లడించారు. సాధ్యమైనంత వరకు గాజు సీసాల్లోనే మద్యం నింపాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాని పక్షంలో రూ. 800 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన మద్యాన్ని గాజు సీసాల్లోనే విక్రయించాలని, తక్కువ ధర కలిగిన మద్యాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో నింపవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని సెప్టెంబరులో కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టి, జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Kerala Government
Kerala
Liquor bottle deposit
Excise Department
MB Rajesh
Beverages Corporation

More Telugu News