Nara Lokesh: ఆ పెట్టెల లెక్క జగన్ కే బాగా తెలుసు!... లిక్కర్ స్కాంపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh Comments on Liquor Scam Allegations Against Jagan
  • సచివాలయంలో నారా లోకేశ్ ప్రెస్ మీట్ 
  • హైదరాబాదులో నగదు పట్టుబడడంపై స్పందన 
  • ఎంత మొత్తం చేతులు మారిందో తెలుసుకోవాలంటే జగన్‌ను అడగాలని వ్యాఖ్యలు
లిక్కర్ కుంభకోణంపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి, ఏ పెట్టెలో ఎంత డబ్బు చేరుతుందో జగన్‌కే బాగా తెలుసని మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫాంహౌస్ లో పెద్దఎత్తున డబ్బు పట్టుబడటంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, ఈ కుంభకోణంలో ఎంత మొత్తం చేతులు మారిందో తెలుసుకోవాలంటే జగన్‌ను అడగాలని లోకేశ్ ఎద్దేవా చేశారు.

లోకేశ్ మాట్లాడుతూ, "దేశంలో ఎక్కడైనా లిక్కర్ కంపెనీ రూ. 400 కోట్ల బంగారం కొంటుందా? లిక్కర్ బంగారంతో తయారు చేస్తారా?" అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో అద్భుతమైన పెట్టుబడులు పెట్టవచ్చని వీరు నిరూపించారని, ఇది రాజకీయాల్లో నేరమయతత్వానికి గొప్ప ఉదాహరణ అని విమర్శించారు. అదాన్ డిస్టిలరీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి డబ్బు బదిలీ అయిందని, అక్కడి నుంచి జగన్‌కు చేరిందని లోకేశ్ స్పష్టం చేశారు. పీఎల్ఆర్ సంస్థ అవినీతి కంపెనీ అని, లిక్కర్ కంపెనీ నుంచి పీఎల్ఆర్ కు ఎందుకు డబ్బు వెళ్లిందో సూటిగా ప్రశ్నిస్తున్నానని లోకేశ్ డిమాండ్ చేశారు. తమ అకౌంట్ కు డబ్బు వచ్చిన మాట నిజం కాదని పెద్దిరెడ్డి చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యంపై కూటమి పోరాడిందని, ఇప్పుడు పారదర్శకమైన పాలసీని తీసుకొచ్చామని లోకేశ్ తెలిపారు.

"జగన్ బయట తిరుగుతున్నారంటే ఎమర్జెన్సీ లేదనే అర్థం!"

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్న జగన్ వ్యాఖ్యలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. "అటువంటి పరిస్థితులే ఉంటే జగన్ బయట తిరిగే వారా? స్వేచ్ఛగా హెలికాప్టర్‌లో తిరుగుతున్నారు, ఆయనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నాం" అని లోకేశ్ పేర్కొన్నారు. నెల్లూరులో జగన్ పర్యటించే ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల మట్టి తొలగించబడిందని, దాన్ని తమపై రుద్దవద్దని ఆయన స్పష్టం చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ అద్దాన్ని పగలగొట్టడం వల్ల రూ. 16 లక్షల నష్టం వచ్చిందని అద్దెకు ఇచ్చిన సంస్థ వాపోయిందని లోకేశ్ గుర్తు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి బయటకు వెళితే 3,000 మంది పోలీసులను వినియోగిస్తున్నామని, ముఖ్యమంత్రికి కూడా అంత భద్రత ఉండదని లోకేశ్ వివరించారు. ఈరోజు నెల్లూరు పర్యటనలో కూడా వైసీపీ కార్యకర్తలు పోలీసులను కొట్టారని, పోలీసులు లేకుండా చేస్తే జగన్ ఎక్కడికైనా వెళ్లగలరా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం జగన్ మాదిరిగా సొంత కార్యకర్తలను చంపలేదని లోకేశ్ అన్నారు. తల్లిపైన కేసు గెలిచాక సంబరాలు చేసుకున్న ఏకైక కొడుకు జగన్ మాత్రమే అని, తల్లి, చెల్లిపైనా ఎవరైనా కేసు పెడతారా అని లోకేశ్ మండిపడ్డారు. 2021లో వారికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను లాగేసుకున్న నాయకుడు జగన్ అని, తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివాడు రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారని లోకేశ్ దుయ్యబట్టారు.

రాజ్యాంగం అందరికీ తిరిగే స్వేచ్ఛను ఇచ్చిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తాము అమలుచేస్తున్నామని లోకేశ్ పునరుద్ఘాటించారు. జగన్ పర్యటనకు వెళ్లినపుడు పోలీసులు జనాలను క్రమబద్ధీకరిస్తున్నారని, ఆయనపై జనం పడితే మళ్లీ తమకు భద్రత ఇవ్వలేదని చెబుతారని అన్నారు. మందు, డబ్బు ఇచ్చి జనాలను వారి కార్యక్రమాలకు తోలుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జగన్ కారు కిందపడి ఒక వ్యక్తి చనిపోయారని, ఒకరు గుండెపోటుతో మరణించారని, అంబులెన్స్‌లో చిక్కుకొని మరొకరు చనిపోయారని లోకేశ్ గుర్తు చేశారు. అటువంటివి జరగకుండా క్రమబద్ధీకరిస్తే తప్పు ప్రభుత్వానిది అంటారని ఆయన విమర్శించారు. జగన్ లా తాము గేట్లకు తాళ్లు కట్టడం లేదని, చంద్రబాబు ఇంటి చుట్టూ 144వ సెక్షన్ అమలు చేసినట్టుగా తాము చేయడం లేదని లోకేశ్ స్పష్టం చేశారు.


Nara Lokesh
Andhra Pradesh
Liquor Scam
Jagan Mohan Reddy
TDP
AP Politics
Corruption Allegations
PLR Company
Peddireddy Ramachandra Reddy
Nellore

More Telugu News