Nara Lokesh: కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా?... అయినా మేం అడ్డుపడలేదే!: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh on Kaleshwaram Project Approvals and Water Disputes
  • సింగపూర్ పర్యటన నుంచి తిరిగొచ్చిన ఏపీ మంత్రి నారా లోకేశ్ 
  • సచివాలయంలో ప్రెస్ మీట్ 
  • బనకచర్లకు అనుమతి ఉందా అని అడిగిన ఓ రిపోర్టర్ 
  • కాళేశ్వరం అనుమతి గురించి ప్రశ్నించిన లోకేశ్
  • తాము మిగులు జలాలనే ఉపయోగించుకుంటామని స్పష్టీకరణ 
  • తెలంగాణ ప్రయోజనాలకు టీడీపీ ఎప్పుడూ అడ్డుపడదని ఉద్ఘాటన
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నాయకుల ఆరోపణలను ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. సింగపూర్ నుంచి తిరిగొచ్చిన ఆయన ఆ పర్యటన వివరాలను ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఎప్పుడూ అడ్డుపడలేదని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్ళే మిగులు జలాలను ఉపయోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మిగులు జలాలను రాయలసీమకు తరలిస్తే తెలంగాణకు ఇబ్బంది ఎందుకని నిలదీశారు. నీళ్లు లేనప్పుడు ఒక ఏడాది ప్రాజెక్టును ఖాళీగా ఉంటే ఏమవుతుంది? నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తామని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ ను ఓ మీడియా ప్రతినిధి బనకచర్లకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ, రెగ్యులేటరీ కమిటీ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా నిర్మించారని ప్రశ్నించారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తెలుగువారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పెట్టుబడులను తాము ఎప్పుడైనా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు.

తెలుగువారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారు నెం.1గా ఉండాలన్నదే తమ లక్ష్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు. తెలుగువారి సంక్షేమం కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు.

బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భూభాగంపైనే ప్రతిపాదించబడిందని, 'అక్కడొక రూల్, ఇక్కడొక రూలా? తెలంగాణకు ఒక నీతి... ఆంధ్రకు మరో నీతా?' అని లోకేశ్ ప్రశ్నించారు. తామేమీ కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లు పెట్టి తెలంగాణ నీళ్లను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయి చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

నదుల అనుసంధానం అత్యవసరమని లోకేశ్ ఉద్ఘాటించారు. గోదావరి దేవుడిచ్చిన వరమని, కృష్ణా వరద నీరు తరలించి 80 శాతం రిజర్వాయర్లను నింపామని తెలిపారు. లైనింగ్ చేసి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం తమ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

Nara Lokesh
Kaleshwaram Project
Banakacherla Project
Andhra Pradesh
Telangana
Water Disputes
River Linking
Telugu Desam Party
AP Politics
TS Politics

More Telugu News