Shashi Tharoor: అమెరికా, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గకూడదు: భారత ప్రభుత్వానికి శశిథరూర్ సూచన

Shashi Tharoor urges India to resist Trumps pressure
  • వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ప్రకటన సరికాదన్న థరూర్
  • భారత వాణిజ్యానికి అమెరికా అతిపెద్ద మార్కెట్ అని వెల్లడి
  • వాణిజ్య చర్చల్లో బేరసారాల కోసమే టారిఫ్ హెచ్చరిక కావొచ్చన్న శశిథరూర్
భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గకుండా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. భారత దిగుమతులపై 25 శాతం సుంకంతో పాటు అదనంగా జరిమానాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా టారిఫ్ అంశంపై శశిథరూర్ స్పందించారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన సరికాదని ఆయన అన్నారు. భారత వాణిజ్యానికి అమెరికా అతిపెద్ద మార్కెట్ అని, మన ఎగుమతులే 87 - 90 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయని వెల్లడించారు. రష్యా నుంచి దిగుమతులు చేస్తున్నందుకు సుంకాలు, జరిమానా విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య చర్చల్లో బేరసారాల కోసం ఇది హెచ్చరిక కావొచ్చని ఆయన అన్నారు.

టారిఫ్‌ల నేపథ్యంలో ఎగుమతులు తగ్గితే అది మనకు నష్టం చేస్తుందని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఇది మన జీడీపీపై కూడా ప్రభావం చూపించవచ్చని తెలిపారు. అమెరికా డిమాండ్లు పూర్తిగా అర్థంలేనివిగా ఉన్నాయని ఆయన అన్నారు. వాటిని ప్రతిఘటించే హక్కు భారత్‌కు ఉందని వ్యాఖ్యానించారు. వారిని సంతోషపెట్టడానికి మన జీవనోపాధిని పణంగా పెట్టలేమని ఆయన అన్నారు. మన అవసరాలను కూడా అగ్రరాజ్యం అర్థం చేసుకోవాలని శశిథరూర్ అన్నారు.

ట్రంప్ టారిఫ్‌ల విషయంలో మన దేశ విధానంపై నమ్మకం ఉందని శశిథరూర్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చర్చలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా ఒత్తిడికి మాత్రం తలొగ్గకూడదని వ్యాఖ్యానించారు.
Shashi Tharoor
India US trade
Donald Trump
US tariffs
Indian economy
trade war

More Telugu News