Turaka Kishore: జైలు నుంచి బయటకి వచ్చిన వెంటనే తురకా కిశోర్ మరో కేసులో అరెస్టు .. హైకోర్టు ఏమన్నదంటే..?

High Court Questions Police on Turaka Kishore Re arrest Details
  • తురకా కిశోర్‌ను మరో కేసులో అరెస్టు చేసిన పోలీసులు
  • హైకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేసిన కిశోర్ అర్ధాంగి సురేఖ
  • కిశోర్‌పై కేసులు, అరెస్టుల పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు 
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిశోర్‌కు వివిధ కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అవ్వడం, ఆ వెంటనే మరో కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం తెలిసిందే.

తొలుత గుంటూరు జైలు వద్ద వెల్దుర్తి పోలీసులు తురకా కిశోర్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా, కిషోర్ అర్ధాంగి సురేఖ, అతని కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెంటచింతలలో నమోదైన మరో హత్యాయత్నం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిరసన తెలుపుతున్న వారిని తప్పించి కిశోర్‌ను పోలీసులు తీసుకువెళ్లారు.

దీనిపై కిశోర్ అర్ధాంగి తురకా సురేఖ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన తన భర్తను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ జె సుమతితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్ తరపు న్యాయవాది రామ లక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కిశోర్‌పై పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తూ, ఒకదాంట్లో బెయిలొస్తే ఇంకో దాంట్లో అరెస్టు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకూ 12 కేసులు నమోదు చేశారన్నారు.

పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. హత్యాయత్నం చేసిన కేసులో కిశోర్‌ను అరెస్టు చేశారని తెలిపారు. కిశోర్‌పై ఇప్పటి వరకు ఎన్నికేసులు నమోదయ్యాయి? ఫిర్యాదులు ఎప్పుడు అందాయి? ఎప్పుడు అరెస్టు చేశారు? తదితర పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది.

గత ఏడాది ఏప్రిల్ 8న ఘటన చోటు చేసుకుంటే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. 
Turaka Kishore
YCP
Pinnelli Ramakrishna Reddy
Macharla
Andhra Pradesh
Guntur
High Court
Arrest
Attempt to Murder Case
Surekha

More Telugu News