IAS officer: విధుల్లో చేరిన తొలిరోజే గుంజీలు తీసిన ఐఏఎస్‌ అధికారి.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

IAS Officer Does Sit Ups On First Day In UP Over Lack Of Cleanliness
  • యూపీలోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో ఘ‌ట‌న 
  • విధుల్లో చేరిన తొలిరోజే పరిశుభ్రతపై దృష్టిసారించిన ఐఏఎస్‌ అధికారి రింకూ సింగ్‌
  • బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితో గుంజీలు తీయించిన వైనం
  • ఆయ‌న ప‌నిచేసే తహసీల్‌ కార్యాలయం, అక్కడి టాయిలెట్ల‌లోనూ అపరిశుభ్రత‌
  • ఈ విష‌య‌మై న్యాయవాదులు ప్రశ్నించ‌డంతో తానూ గుంజీలు తీసిన ఐఏఎస్
విధుల్లో చేరిన తొలిరోజే ఓ ఐఏఎస్‌ అధికారి గుంజీలు తీసిన ఘ‌ట‌న యూపీలోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తొలిరోజే పరిశుభ్రతపై దృష్టిసారించిన ఆ ఐఏఎస్‌ అధికారి.. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితో గుంజీలు తీయించారు. అయితే, ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రంగా ఉండటాన్ని న్యాయవాదులు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆ ట్రైనీ ఐఏఎస్‌ అధికారి అందరి ముందు గుంజీలు తీశారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... పోవాయన్ తహసీల్‌కు కొత్త సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా ట్రైనీ ఐఏఎస్‌ అధికారి రింకూ సింగ్‌ నియమితులయ్యారు. మంగళవారం తొలిసారి విధులు నిర్వహించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయన పట్టణంలో తిరిగి పరిశుభ్రతను పరిశీలించారు.

అయితే, పబ్లిక్ టాయిలెట్స్‌ పక్కన కొందరు వ్యక్తులు బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని రింకూ సింగ్ గ‌మ‌నించారు. దాంతో వెంట‌నే ఆయ‌న అలా చేసిన‌ కొందరితో గుంజీలు తీయించారు. అయితే తాను బ్రాహ్మణుడ్నని, మురికిగా ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లోకి వెళ్లలేన‌ని ఒక న్యాయవాది చెప్పాడు. అందుకే బ‌హిరంగ మూత్ర  విస‌ర్జ‌న చేసిన‌ట్లు తెలిపాడు. అలాగే కొంత‌మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తిరుగుతుండటాన్ని రింకూ సింగ్ చూశారు. పిల్లలను పాఠ‌శాల‌కు పంపనందుకు ఆ తల్లిదండ్రులతో కూడా గుంజీలు తీయించారు.

మరోవైపు, నిరసన చేపట్టిన న్యాయవాదులను రింకూ సింగ్‌ కలిశారు. అయితే, ఆయనతో మాట్లాడేందుకు న్యాయవాదులు నిరాకరించారు. జనంతో గుంజీలు తీయించడాన్ని నిలదీశారు. తహసీల్‌ కార్యాలయం, అక్కడి టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని ఈ సంద‌ర్భంగా న్యాయవాదులు ప్రశ్నించారు. దీంతో అధికారుల తప్పుగా భావించిన రింకూ సింగ్‌ అందరి ముందు తాను గుంజీలు తీశారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 
IAS officer
Rinku Singh
Shahjahanpur
Uttar Pradesh
SDM
cleanliness drive
public urination
viral video
Indian Administrative Service
trainee IAS

More Telugu News