Turaka Kishore: జైలు నుంచి బయటికి వచ్చాడో లేదో మరో కేసులో తురకా కిశోర్ అరెస్ట్

Turaka Kishore Arrested Again After Jail Release
  • పలు కేసుల్లో తురకా కిశోర్ కు బెయిల్ 
  • నేడు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల
  • టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న రెంటచింతల పోలీసుల
  • పోలీసు వాహనాన్ని అడ్డుకున్న కిశోర్ కుటుంబ సభ్యులు 
  • వారిని తప్పించి వాహనాన్ని ముందుకు తీసుకెళ్లిన పోలీసులు
వైసీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్‌ను రెంటచింతల పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వెంటనే, టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో ఆయనను రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ సందర్భంగా గుంటూరు జిల్లా జైలు వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. తురకా కిశోర్ కుటుంబ సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు వారిని పక్కకు తప్పించి కిశోర్‌ను రెంటచింతల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తురకా కిశోర్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిగా వైసీపీ హయాంలో మాచర్లలో అనేక అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నల కారుపై సెంట్రింగ్ రాడ్‌తో హత్యాయత్నం చేసిన ఘటనతో కిశోర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కిశోర్ కు మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి దక్కడం గమనార్హం. ఈ పదవిలో ఉంటూ ఆయన మాచర్ల మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిశోర్‌పై మొత్తం 12 కేసులు నమోదయ్యాయి, వీటిలో 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్ కేసు ఉన్నాయి. పీడీ యాక్ట్ కేసును కోర్టు కొట్టివేయగా, మిగిలిన కేసుల్లో బెయిల్ మంజూరైంది. అయితే, మరికొన్ని కేసులు నమోదు కాకుండా ఆదేశాలివ్వాలని కిశోర్ సుప్రీంకోర్టును కోరగా, ఆ పిటిషన్‌ను కోర్టు నిన్న తిరస్కరించింది.

ప్రస్తుతం, రెంటచింతలలో టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టైన తురకా కిశోర్‌పై మరిన్ని చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన మాచర్ల రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది.
Turaka Kishore
Macharla
YSRCP
Pinnelli Ramakrishna Reddy
Guntur
Andhra Pradesh Politics
Attempt to Murder Case
Bonda Uma
Buddha Venkanna
Rentachintala

More Telugu News