Raja Singh: బీజేపీ నా ఇల్లు.. వారి నుంచి పిలుపు రాలేదు: రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Raja Singh Says BJP is His Home No Call Received
  • ఇతర పార్టీల నుంచి తనకు ఆహ్వానం రాలేదన్న రాజాసింగ్
  • బీజేపీ అధికారంలోకి రావాలనేది ప్రతి కార్యకర్త కోరిక అని వ్యాఖ్య
  • ఢిల్లీ పెద్దలు పిలిచాక ఎందుకు రాజీనామా చేశానో చెబుతానని వెల్లడి
కమలం పార్టీ తన పార్టీ అని, అది తన ఇల్లుగా భావిస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కొన్ని వారాల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఇతర ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని, బీజేపీ పిలిస్తే వెళతానని స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త సంవత్సరాలుగా ఆశతో ఉన్నారని, కానీ ప్రతిసారి కొన్ని తప్పుల వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనతో సహా కొందరు నాయకుల వల్ల తప్పులు జరిగి ఉండవచ్చని, అందుకే పార్టీ అధికారంలోకి రాలేకపోయిందని అన్నారు. ఇలాంటి విషయాలను ఢిల్లీ పెద్దలకు చెప్పడానికి తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు.

నేడో రేపో తనను కేంద్ర పెద్దలు పిలిచి మాట్లాడనున్నారని, వారిని కలిసినప్పుడు తాను ఎందుకు రాజీనామా చేశానో వారికి చెబుతానని ఆయన అన్నారు. ఏదేమైనా బీజేపీ తన ఇల్లు అని, కేంద్రం పెద్దలు రమ్మంటే ఎప్పుడైనా వెళతానని (పార్టీలో తిరిగి చేరడం) రాజాసింగ్ తెలిపారు. తనను పార్టీ నుంచి ఎవరూ బయటకు పంపించలేదని, తానే వెళ్ళానని ఆయన చెప్పారు.

హరీశ్ రావు తనను కలిసి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్లు జరిగిన ప్రచారాన్ని రాజాసింగ్ కొట్టి పారేశారు. బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ నాయకులు తనతో సంప్రదింపులు జరపలేదని, జరపబోరని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా హరీశ్ రావు, కేటీఆర్‌లతో సంబంధాలు ఉన్నప్పటికీ వారు తనను ఆహ్వానించలేదని అన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు, ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై కాంగ్రెస్ బిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక వారు తన గురించి ఎందుకు ఆలోచిస్తారని వ్యాఖ్యానించారు. తాను హిందూవాదినని, కాబట్టి వారికి తన అవసరం లేదని అన్నారు. వారికి కావాల్సింది మజ్లిస్ అని విమర్శించారు. 

తాను తెలంగాణ శివసేన బాధ్యతలను తీసుకోనున్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. తాను శివసేన లేదా జనసేన లేదా టీడీపీలోకి వెళతారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగిందని, కానీ ఆ పార్టీలు బీజేపీతోనే కలిసి ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.

"నేను రాజీనామా చేసిన సమయంలోనే ఓ మాట స్పష్టంగా చెప్పాను. రాజాసింగ్ బీజేపీలో ఉన్నా లేకపోయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక సైనికుడిగా ఉంటానని చెప్పాను. యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డా, అమిత్ షా చేస్తున్న మంచి పనులకు ప్రచారం చేయడానికి మేం ముందుంటాం. ఇదే విషయాన్ని రాజీనామా చేసిన విషయంలో చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను" అని అన్నారు.
Raja Singh
BJP
Telangana
Goshamahal
Harish Rao
BRS
Hinduism
Narendra Modi
Amit Shah
JP Nadda

More Telugu News