Farukh Aslam Khan: బీసీసీఐ కార్యాలయం నుంచి రూ. 6.5 లక్షల విలువ చేసే ఐపీఎల్ జెర్సీలు చోరీ

Farukh Aslam Khan Arrested for IPL Jersey Theft from BCCI Office
  • ముంబైలోని వాంఖేడే స్టేడియంలోని కార్యాలయంలో దొంగతనం
  • గత నెల 13న జరిగిన దొంగతనం.. ఆలస్యంగా వెలుగులోకి
  • దొంగిలించి ఆన్‌లైన్ డీలర్‌కు విక్రయించిన సెక్యూరిటీ గార్డు ఫరూఖ్
బీసీసీఐ కార్యాలయం నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలు చోరీకి గురయ్యాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఫరూఖ్ అస్లాం ఖాన్ అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారని సమాచారం. ఒక్కో జెర్సీ ఖరీదు రూ. 2,500 ఉంటుందని అంచనా.

పోలీసుల విచారణలో నిందితుడు జూదానికి బానిసై ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. ఈ జెర్సీలు వేర్వేరు జట్లకు చెందినవి. అయితే, అవి ఆటగాళ్ల కోసమా లేదా అభిమానుల కోసమా అనే విషయం తెలియాల్సి ఉంది. నిందితుడు దొంగిలించిన జెర్సీలను హర్యానాకు చెందిన ఓ ఆన్‌లైన్ డీలర్‌కు విక్రయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ దొంగతనం గత నెల 13న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టోర్ రూంలో స్టాక్ మిస్ అయినట్లు ఆడిట్‌లో తేలడంతో చోరీ విషయం బయటపడింది. బీసీసీఐ అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జులై 17న బీసీసీఐ అధికారులు మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను జెర్సీలను కొరియర్ ద్వారా ఆన్‌లైన్ డీలర్‌కు పంపించినట్లు నిందితుడు అంగీకరించాడు.

సెక్యూరిటీ గార్డు నుంచి జెర్సీలను కొనుగోలు చేసిన డీలర్‌ను విచారణ కోసం హర్యానా నుంచి పిలిపించారు. తనకు జెర్సీలు విక్రయించిన వ్యక్తి వాటిని దొంగిలించినట్లు తనకు తెలియదని డీలర్ పోలీసులకు తెలిపాడు. కార్యాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా జెర్సీలు అమ్మకానికి ఉన్నట్లు తనతో చెప్పాడని పోలీసులకు వెల్లడించాడు. తన బ్యాంకు ఖాతాలో డీలర్ డబ్బులు జమ చేశాడని, వాటిని ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
Farukh Aslam Khan
BCCI
IPL jerseys
Wankhede Stadium
Mumbai theft

More Telugu News