Chandrababu: ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుంద‌న్న మంత్రి టాన్సీ లెంగ్.. ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

Chandrababu Thanks Singapore Minister for AP Development Partnership
  • ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుంద‌న్న మంత్రి టాన్సీ లెంగ్ 
  • 2019 తర్వాత ఏపీలో వచ్చిన ప్రభుత్వం నుంచి సహకారం ఆగిపోయింద‌న్న మంత్రి
  • సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించిన టాన్సీ లెంగ్‌
  • ధన్యవాదాలు తెలుపుతూ.. సింగపూర్ భాగస్వామ్యం విలువైందన్న‌ చంద్ర‌బాబు
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా.. గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సింగపూర్ మంత్రి చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ట్రేడ్ ఇండస్ట్రీ శాఖలోని మానవ వనరులు, శాస్త్రసాంకేతిక మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. 

సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) హ్యాండిల్ లో పోస్టు చేసిన ఆయన ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం లాంటి రంగాలు పెట్టుబడులకు అనుకూలమని టాన్సీ లెంగ్ పేర్కొన్నారు. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఫుడ్ ఎంపైర్, ఎవర్ వోల్ట్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. 

అలాగే పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులతో పాటు భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. మరోవైపు 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని గుర్తు చేశారు. 

అయితే, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సహకారం ఆగిపోయిందని అన్నారు. సింగపూర్ కన్సార్టియం కూడా అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిందని టాన్సీ లెంగ్ తన పోస్టులో పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబుతో సమావేశమై ఏపీ అభివృద్ధిపై చర్చించినట్టు ఆయన వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పనిచేయకున్నా.. ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించటంతో పాటు ప్రపంచబ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పనిచేస్తామని టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్టు సింగపూర్ మంత్రి త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం విలువైంది: సీఎం చంద్ర‌బాబు

వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియచేశారు. ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి, ఆ దేశ మంత్రి టాన్సీ లెంగ్ కు 'ఎక్స్' వేదికగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. 

వివిధ రంగాల్లో ఏపీ-సింగపూర్ కలిసి పనిచేయడానికి టాన్సీ లెంగ్ తో జరిపిన చర్చలు బాటలు వేశాయని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉత్పాదక రంగం, రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్టులు, డిజిటల్, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఈ చర్చలు దోహద పడతాయన్నారు. 90వ దశకం నుంచి సింగపూర్ ప్రభుత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువైందని సీఎం చంద్ర‌బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఏపీ అభివృద్ధి ప్రయాణంలో.. ఆధునిక మౌలిక వసతుల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం నుంచి సహకారం ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో అద్భుతమైన ప్రజా తీర్పుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంకల్పం తీసుకున్నామన్నారు. స్వర్ణాంధ్ర-2047 సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్య‌మంత్రి వివరించారు. వివిధ రంగాల్లో సింగపూర్ దేశ విధానాలు ఎప్పుడూ స్పూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. పట్టణ, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు సింగపూర్ తోడైతే ప్రజల ఆశలను నెరవేర్చగలమని సీఎం చంద్ర‌బాబు తన ట్వీట్ లో ఆకాంక్షించారు. 
Chandrababu
Andhra Pradesh
Singapore
Tanee Leng
AP Development
Amaravati
Investments AP
AP Singapore Partnership
Skill Development
Green Energy

More Telugu News