Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు.. మండి జిల్లాలో బీభత్సం.. వీడియో ఇదిగో!

Heavy Rains Trigger Landslides and Floods in Himachal Pradesh
  • ఈ రోజు తెల్లవారుజామున కుండపోత
  • కొట్టుకుపోయిన వాహనాలు.. రోడ్లు ధ్వంసం
  • లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి చేరిన వరద
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున మండి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. రోడ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. వరద తగ్గిన తర్వాత బురదలో కూరుకుపోయాయి. వర్ష బీభత్సానికి సంబంధించి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. అవి వైరల్ గా మారాయి. వరదల కారణంగా జిల్లాలోని పలు రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలను వరద ముంచెత్తింది.

దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని వివరించారు. మండి జిల్లా కేంద్రంలోని జైల్ రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైంజ్ రీజియన్ తదితర ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్ తదితరులు పర్యటించారు. కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో, శిథిలాల తొలగింపులో రెస్క్యూ సిబ్బంది 24 గంటలూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. కాగా, వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో పఠాన్ కోట్ - మండి జాతీయ రహదారి, కిరాత్పూర్ - మనాలి నాలుగు లేన్ల రహదారి, చండీగఢ్ - మనాలి హైవేలు మూతపడ్డాయి. కొండచరియలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Himachal Pradesh Floods
Mandi district
floods
heavy rains
landslides
national highway
rescue operations
disaster
natural disaster

More Telugu News