McDonalds: ఆపరేషన్ సిందూర్ చర్చలోకి ‘మెక్ డొనాల్డ్స్’.. రెస్టారెంట్ ను మూసేయాలన్న ఎంపీ

Operation Sindoor debate Deepender Hooda urges action against McDonalds
  • భారత్- పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటున్న ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా
  • తప్పుడు ప్రకటనల ఫలితం ట్రంప్ కు తెలిసివచ్చేలా చేయాలని డిమాండ్
  • భారత్ పాక్ లను ఒకే గాటన కట్టడమేంటని అమెరికా తీరుపై ఫైర్
ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జరుగుతున్న చర్చలోకి కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా అమెరికాకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ ‘మెక్ డొనాల్డ్స్’ ను లాగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బుద్ధి చెప్పాలంటే భారతదేశంలోని మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ చెయిన్ ను మూసేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణించాలన్న అమెరికా తీరుకు గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చేస్తున్న తప్పుడు ప్రకటనలకు ఫలితం ఆయనకు తెలిసి వచ్చేలా చేయాలన్నారు.

ఈ మేరకు మంగళవారం లోక్ సభలో దీపేందర్ హుడా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న భారతదేశాన్ని ఉగ్రవాదులకు నిలయంగా పేరొందిన పాకిస్థాన్ ను అమెరికా ఒకే గాటన కడుతోందని మండిపడ్డారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ పూర్తిగా ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల ఫలితమేనని కేంద్రం చెబుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ట్రంప్ ప్రకటనను హుడా ప్రస్తావించారు.

యుద్ధాన్ని తానే ఆపానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని, వాణిజ్య ఒప్పందం పేరుతో భారత్ పాక్ లను బెదిరించి రాజీ కుదిర్చానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. భారత్ అభ్యంతరం చెబుతున్నా ట్రంప్ పదే పదే తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో ట్రంప్ కు గుణపాఠం చెప్పాలంటే భారతదేశంలోని అమెరికా రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్ ను మూసేయాలని హుడా డిమాండ్ చేశారు.
McDonalds
Deepender Hooda
Operation Sindoor
Donald Trump
India Pakistan
Lok Sabha
US relations
Ceasefire
Terrorism
Restaurant

More Telugu News