Ashley Gearhardt: చిప్స్, కుకీస్ తినడం డ్రగ్ అడిక్షన్‌తో సమానం!

Ultra Processed Foods Addiction Study Reveals Health Risks
  • వెల్లడించిన తాజా అధ్యయనం
  • డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు లాగే బానిసలుగా మార్చగలవని వెల్లడి
  • దేశంలో వేగంగా పెరుగుతున్న అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం
మీరు చిప్స్, కుకీస్, ఐస్‌క్రీమ్, చాక్లెట్ వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్ఎస్) ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త! ఇవి మిమ్మల్ని డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు లాగే బానిసలుగా మార్చగలవని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ ఆహారాలు సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్స్‌ (వ్యసనాలు)తో సమానమైన వ్యసన కారకాలుగా మారుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అధ్యయనం ఏం చెబుతోంది?
మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు ఆష్లే గియర్‌హార్ట్ నేతృత్వంలో 36 దేశాలలో జరిగిన 281 అధ్యయనాలను విశ్లేషించారు. ఈ పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది పిల్లలు ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు బానిసలవుతున్నారని తేలింది. ఈ అడిక్షన్ రేట్లు ఆల్కహాల్ (14శాతం), పొగాకు (18శాతం) వంటి పదార్థాలకు ఉన్న వ్యసన రేట్లతో దాదాపు సమానంగా ఉన్నాయి.
 
మెదడుపై ప్రభావం: అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే అధిక చక్కెర, ఉప్పు, కొవ్వులు మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను ప్రేరేపిస్తాయి. ఇది కొకైన్ లేదా ఆల్కహాల్ వంటి డ్రగ్స్‌కు సమానమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం పేర్కొంది.

డోపమైన్ విడుదల: ఈ ఆహారాలు మెదడులో డోపమైన్ విడుదలను పెంచుతాయి. డోపమైన్ అనేది ఆనందం, రివార్డ్‌లతో ముడిపడి ఉన్న రసాయనం. ఇది వ్యక్తులు ఈ ఆహారాలను పదే పదే తినాలని కోరుకునేలా చేస్తుంది.

వ్యసన లక్షణాలు: ఈ ఆహారాలు తినడం వల్ల క్రేవింగ్స్ (తీవ్రమైన కోరిక), నియంత్రణ కోల్పోవడం, ఉపసంహరణ లక్షణాలు (అంటే ఆ ఆహారం లేనప్పుడు చిరాకు లేదా ఆందోళన) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి డ్రగ్ వ్యసనంలో కనిపించే లక్షణాలకు చాలా దగ్గరగా ఉంటాయి.

పిల్లలలో ప్రమాదం: పిల్లలలో కూడా 12 శాతం మంది ఈ ఆహారాలకు బానిసలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది వారి భవిష్యత్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఫుడ్ అడిక్షన్ భావనను అందరూ అంగీకరించనప్పటికీ, కొందరు పరిశోధకులు ఆహారాన్ని డ్రగ్స్‌తో పోల్చడం సరికాదని వాదిస్తున్నారు. కానీ ఆష్లే గియర్‌హార్ట్ వంటి వారు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లోని చక్కెర, ఉప్పు, కొవ్వుల ప్రత్యేక కలయిక సహజ ఆహారాల కంటే భిన్నమైన, వ్యసన కారక ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. 

ఈ వ్యసనానికి చికిత్సగా, సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్స్‌కు ఉపయోగించే ఔషధాలు (ఉదా: నాల్ట్రెక్సోన్, బుప్రోపియన్), గ్లూకాగన్-లైక్ పెప్టైడ్-1 (జీఎల్‌పీ-1) అగోనిస్ట్‌లు సహాయపడవచ్చు. అలాగే, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

మన దేశంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో. ఇది ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలను పెంచుతోంది. ఈ అధ్యయనం ప్రకారం ఫుడ్ ఇండస్ట్రీపై కఠిన నిబంధనలు విధించడం, ఎఫ్ఎస్ఎస్ఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ద్వారా లేబులింగ్, మార్కెటింగ్ నిబంధనలను కఠినతరం చేయడం అత్యవసరం. స్కూళ్లలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. ఈ అధ్యయనం ఫుడ్ అడిక్షన్‌ను అధికారికంగా ఒక డిజార్డర్‌గా గుర్తించి, బాధితులకు సరైన చికిత్స, మద్దతు అందించాలని సూచిస్తోంది. 
Ashley Gearhardt
Ultra processed foods
UPFs addiction
Food addiction
Junk food addiction
Sugar addiction
Obesity
Diabetes
Processed foods health risks
Dopamine release

More Telugu News