Hyderabad: ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా షాక్ కొట్టి మ‌హిళ మృతి

Woman Dies of Electric Shock from Fridge in Hyderabad
  • హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న‌
  • హైద‌ర్‌గూడ ఎర్ర‌బోడ‌కు చెందిన లావ‌ణ్య విద్యుదాఘాతంతో మృతి
  • త‌ల్లిని కాపాడ‌టానికి పెద్ద‌కూతురు ప్ర‌య‌త్నించినా సాధ్యంకాని వైనం
ఫ్రిజ్‌ డోర్‌ తీస్తుండగా షాక్‌ కొట్టి ఓ మ‌హిళ మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సోమ‌వారం చోటుచేసుకుంది. ఎస్ఐ కిశోర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... హైద‌ర్‌గూడ ఎర్ర‌బోడ‌కు చెందిన లావ‌ణ్య‌(40)కు ముగ్గురు కూతుళ్లు. భ‌ర్త ప‌దేళ్ల కింద మృతిచెంద‌గా, ఇళ్ల‌లో ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 

గ‌తేడాది పెద్ద‌కూతురుకు పెళ్లి చేసింది. ఆమెకు కుమారుడు పుట్ట‌డంతో పుట్టింట్లోనే ఉంది. నిన్న ఇంట్లోని ఫ్రిజ్ డోర్ తెరిచే స‌మ‌యంలో లావ‌ణ్య‌ విద్యుదాఘాతానికి గురై గ‌ట్టిగా కేక‌లు వేసింది. కాపాడ‌టానికి పెద్ద‌కూతురు ప్ర‌య‌త్నించినా సాధ్యంకాలేదు. స్థానికుల స‌హ‌కారంతో త‌ల్లిని హైద‌ర్‌గూడ‌లోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. దీంతో లావ‌ణ్య ముగ్గురు కుమార్తెలు క‌న్నీరుమున్నీరుగా విల‌పించ‌డం అక్క‌డివారిని క‌లిచివేసింది.  
Hyderabad
Lavanya
Rajendra Nagar
Fridge shock death
Electrocution
Erraboda
Telangana news
Accidental death
Family tragedy
Woman death

More Telugu News