New York Shooting: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా.. ఐదుగురి మృతి!

4 Killed In Shooting At New York City Office Building Suspect Dead
  • దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో కాల్పుల కలకలం
  • ఎన్‌వైపీడీకి చెందిన పోలీస్ అధికారి సహా నలుగురు మృతి
  • పోలీసుల కాల్పుల్లో దుండగుడు షేన్ తమురా హతం
అమెరికాలో మరోసారి తూటా పేలింది. న్యూయార్క్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. సెంట్రల్ మాన్‌హట్టన్‌లోని ఓ భ‌వ‌నంలోకి చొరబడిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎన్‌వైపీడీకి చెందిన పోలీస్ అధికారి సహా నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. 

సోమవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో (అమెరికా కాల‌మానం ప్ర‌కారం) మ్యాన్‌హట్టన్‌లోని పార్క్‌ అవెన్యూ ఆకాశహార్మ్యంలోకి చొరబడిన తమురా.. బిల్డింగ్‌లోని 32 అంతస్తు లాబీలో ఎన్‌వైపీడీ పోలీస్‌ అధికారిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. అనంతరం 33వ అంతస్తులోకి వెళ్లిన నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో మరో ముగ్గురు చ‌నిపోయారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. 

నిందితుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించాడని, ఏఆర్‌ శైలి రైఫిల్‌తో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ బిల్డింగ్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్‌ ప్రధాన కార్యాలయం, హెడ్జ్ ఫండ్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో సహా అనేక ప్రధాన ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. కాల్పుల ఘటనను న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 254 మాస్‌ షూటింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి.
New York Shooting
New York
Manhattan
Shane Tamura
Central Manhattan
Mass shooting
crime
NYPD
police officer

More Telugu News