Dr M Narendra: గుండె పోటుతో తిరుపతి ఆసుపత్రిలో వైద్యుడు మృతి

Dr M Narendra Professor Dies of Heart Attack in Tirupati Hospital
  • తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో గుండెపోటుతో కుప్పకూలిన వైద్యుడు నరేంద్ర
  • వెంటనే అత్యవసర చికిత్స అందించిన వైద్యులు
  • స్విమ్స్ తరలిస్తుండగా మరోసారి గుండెపోటుకు గురై మృతి
తిరుపతిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రుయా ఆసుపత్రి ఆవరణలోనే గుండెపోటుకు గురై వైద్యుడు మృతి చెందారు. రుయా ఆసుపత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. నరేంద్ర (56) నిన్న ఉదయం ఎస్వీ వైద్య కళాశాలకు చేరుకుని బయోమెట్రిక్ హాజరు వేశారు.

అనంతరం రుయా ఆసుపత్రిలోని డిపార్ట్‌మెంట్ వద్దకు నడిచి వెళుతూ పరిపాలనా భవనం వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వెంటనే స్పందించి ఎమర్జెన్సీ విభాగానికి తరలించి సీపీఆర్ చేయడంతో స్పందించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మరోసారి గుండెపోటుకు గురై మృతి చెందారు.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలోని బెళుగుప్పకు చెందిన డాక్టర్ నరేంద్ర పదేళ్లుగా నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహించారు. నెల రోజుల క్రితం బదిలీల్లో భాగంగా తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.

ఆయనకు భార్య శిరీష, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తిరుపతికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన అనంతపురం జిల్లా బెళుగుప్పకు తరలించారు. 
Dr M Narendra
Dr M Narendra death
Tirupati hospital
RUIA hospital
Heart attack
SV Medical College
General medicine professor
Andhra Pradesh news
Anantapur district

More Telugu News