Chandrababu Naidu: బెస్ట్ పాలసీలన్నీ సింగపూర్ నుంచే వస్తున్నాయి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says Best Policies are Coming from Singapore
  • సింగపూర్ లో చంద్రబాబు పర్యటన
  • రెండో రోజు ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం సదస్సుకు హాజరు
  • సింగపూర్ తో తాము 30 ఏళ్లుగా పనిచేస్తున్నామని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సింగపూర్ పర్యటన రెండో రోజు ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... ప్రపంచంలో ఎలాంటి బెస్ట్ పాలసీలు వస్తున్నా, అవి సింగపూర్ నుంచే వస్తున్నాయని అన్నారు. 

సింగపూర్ ప్రభుత్వంతో తాము 30 ఏళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. తాను 90వ దశకంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, హైదరాబాదు ఉప్పల్ లో సింగపూర్ టౌన్ షిప్ ఏర్పాటు చేయాలని కోరానని వెల్లడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ సింగపూర్ తరహాలో వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నామని అన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చేందుకు సింగపూర్ ముందుకువచ్చిందని తెలిపారు. 2014లో ఏపీ మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ వచ్చానని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను చక్కదిద్దేందుకే ఇప్పుడు మళ్లీ వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు. నవంబరు 14, 15 తేదీల్లో ఏపీలో సీఐఐతో కలిసి సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు సింగపూర్ ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాయకులు మిక్స్ డ్, సోషలిస్ట్ ఆర్థిక సిద్ధాంతాలను అనుసరించారని వెల్లడించారు. దాంతో భారత్ చాలాకాలం పాటు వెనుకబాటుతనంతో బాధపడిందని, అలాకాకుండా 1947 నుంచే ఆర్థిక విధానాల్లో పోటీపడి ఉంటే భారత్ ఈపాటికి ఉన్నత స్థానంలో ఉండేదని అన్నారు. చివరికి 1991 వచ్చాక గానీ భారత్ ఆర్థిక సంస్కరణ పట్టలేదని తెలిపారు. భారత్ లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన 13 ఏళ్లకు చైనా కూడా సంస్కరణలు తీసుకువచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Singapore
AP Singapore Business Forum
World Class City
Economic Reforms
CII Summit AP
Singapore Township Uppal
AP Master Plan

More Telugu News