Narendra Modi: మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరగలేదు!: ఆపరేషన్ సిందూర్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Narendra Modi Trump Phone Conversation Jaishankar Key Remarks
  • ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామన్న జైశంకర్
  • ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రపంచమంతా నినదించిందన్న జైశంకర్
  • కాల్పుల విరమణలో ట్రంప్ ప్రమేయాన్ని కొట్టి పారేసిన జైశంకర్
ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. 'ఆపరేషన్ సిందూర్' పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని అన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రపంచమంతా ముక్తకంఠంతో నినదించిందని గుర్తు చేశారు.

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను కుదర్చడంలో ట్రంప్ ప్రమేయాన్ని ఆయన కొట్టి పారేశారు. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్, మురిద్కేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తామని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. పాక్ ఎదురుదాడులను సమర్థంగా ఎదుర్కొన్న తర్వాత దాడులు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అటు నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. కానీ డీజీఎంవో నుంచి విజ్ఞప్తి రావాలని తాము తేల్చి చెప్పామని అన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన టీఆర్ఎఫ్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందని గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, క్వాడ్, బ్రిక్స్‌తో పాటు వివిధ దేశాలు ఖండించాయని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాల్లో మూడు మాత్రమే పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు.

పాకిస్థాన్, చైనాల పరస్పర సహకారం ఆరు దశాబ్దాలుగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. చైనాతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రతిపక్షాలు ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికో, రహస్య ఒప్పందాలు చేసుకోవడానికే తాము చైనాకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. తాను చైనాకు వెళ్లింది తీవ్రవాదం మన పంథా వివరించేందుకు, వాణిజ్య ఒప్పందాల గురించేనని చెప్పారు.
Narendra Modi
Donald Trump
Jaishankar
Operation Sindoor
India Pakistan
Ceasefire

More Telugu News