సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం!
- ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద ఘటన
- పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కుటుంబం
- మునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన స్థానికులు
సాక్షుల కథనం ప్రకారం భటిండా జలపాతం వద్ద వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం సమీపంలో సెల్ఫీలు తీసుకునేందుకు బాధిత కుటుంబం ప్రయత్నించింది. ఈ క్రమంలో కుటుంబంలోని ఒక మహిళ అకస్మాత్తుగా కాలు జారి నీటిలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త, కొడుకు, కూతురు ఆమెను రక్షించేందుకు వెంటనే నీటిలోకి దూకారు. అయితే, జలపాతం వద్ద ఉన్న బలమైన ప్రవాహం కారణంగా నలుగురూ మునిగిపోయారు. సమీపంలో చేపలు పట్టుకుంటున్న స్థానికులు గమనించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్లలో దూకి వారిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.
భటిండా జలపాతంలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురైన ఘటనలు గతంలోనూ జరిగాయి. 2024 ఆగస్టులో సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోగా స్థానికులు వారిని రక్షించారు. కాగా, తాజాగా ప్రమాదం నుంచి బయటపడిన కుటుంబ సభ్యులను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.