Lavu Nageswara Rao: ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిందే: రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వరరావు

Lavu Nageswara Rao Stresses Adherence to Constitution
  • ప్రభుత్వ సంస్థలు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న జస్టిస్ లావు నాగేశ్వరరావు
  • రాజ్యాంగంలో జవాబుదారీతనం అనే అంశంపై విజయవాడలో సదస్సు  
  • రాజధాని మలివిడత భూసమీకరణపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ సంస్థలు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో భారత రాజ్యాంగంలో జవాబుదారీతనం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదని స్పష్టం చేశారు. సభ్యుల అనర్హతపై నిర్ణీత సమయంలో స్పీకర్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అన్నారు.

మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు కీలకమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం అనేది ఒక నమ్మకమని, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని సూచించారు. శాసనవ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండటం ప్రజాస్వామ్యబద్ధ పరిపాలనకు పునాదిరాయి అని అన్నారు.

విశ్రాంత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ వ్యవస్థలో జవాబుదారీతనం, నైతికతకు స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యనిర్వాహక వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

గతంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఒక మంత్రి ఎస్ఈసీపై దుర్భాషలాడారని, ఆ క్రమంలో అతనిపై గ్యాగ్ ఆర్డర్‌ను తాను ఇచ్చానని తెలిపారు. దుర్భాషలాడిన వారిపై ప్రస్తుత ఎస్ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఆయనపై చర్య తీసుకోవాలని ప్రస్తుత డీజీపీని కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

రాజధాని అమరావతి మలి విడత భూసమీకరణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఈ విషయంలో సీఎఫ్‌డీ తటస్థ వైఖరితో ఉందని తెలిపారు. ఈ అంశంపై వివిధ వర్గాలతో తమ సంస్థ సమావేశం ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. సదస్సులో విజయవాడ మాజీ మేయర్ జంద్యాల శంకర్, సీఎఫ్‌డీ ప్రతినిధి దాసు, దివాకర్ బాబు, అశ్విన్ కుమార్ తదితరులు మాట్లాడారు. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు, సీతారామమూర్తిలను సిద్ధార్థ కళాశాల ప్రతినిధి రాజయ్య సత్కరించారు. 
Lavu Nageswara Rao
Supreme Court
Constitution
Accountability
Democracy
Vijayawada
Nimmagadda Ramesh Kumar
Amaravati
AP Politics
Citizens for Democracy

More Telugu News