UPI: రూ.2 వేలకు మించిన యూపీఏ లావాదేవీలపై జీఎస్టీ...? కేంద్రం ఏం చెప్పిందంటే...!

UPI GST on Transactions Over Rs 2000 Clarification from Central Government
  • డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగిన యూపీఐ చెల్లింపులు
  • రూ.2వేలకు మించి జరిగిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే యోచన ప్రభుత్వానికి లేదన్న ఆర్ధిక మంత్రిత్వ శాఖ 
  • రాజ్యసభలో సమాధానమిచ్చిన ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
డిజిటల్ చెల్లింపుల యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు టీ స్టాల్ మొదలుకొని కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికీ ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. దీంతో నగదు రహిత లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి.

అయితే, గత కొన్ని రోజులుగా రూ.2 వేలకు మించి యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారనే పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

రూ.2 వేలకు మించిన లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటన చేశారు. రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలనే ప్రతిపాదన జీఎస్టీ కౌన్సిల్ నుంచి రాలేదని ఆయన వెల్లడించారు.

రూ.2 వేలు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కర్ణాటకలోని వ్యాపారులకు యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందిన తర్వాత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరణ ఇచ్చారు. 
UPI
UPI GST
GST
Digital Payments
Pankaj Choudhary
Finance Ministry
Online Transactions
Cashless Transactions
GST Council
India

More Telugu News