Chandrababu Naidu: కర్మభూమిలో ఎదగండి... జన్మభూమి కోసం నిలవండి: సింగపూర్ లో తెలుగువారికి చంద్రబాబు పిలుపు

Chandrababu Naidu urges Telugu diaspora to develop their homeland
  • సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
  • తెలుగు డయాస్పోరాతో భారీ కార్యక్రమం
  • పెద్ద ఎత్తున హాజరైన తెలుగువారు
  • ఉత్సాహంగా ప్రసంగించిన చంద్రబాబు
విదేశాల్లో స్థిరపడి... సంపద సృష్టిస్తున్న తెలుగు వాళ్లు జన్మభూమిని మరిచిపోకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా తొలి రోజున ఆదివారం స్థానికంగా ఉన్న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో తెలుగు డయాస్పొరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ సహా మలేషియా, థాయ్ ల్యాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు హాజరయ్యారు. సీఎం సభా ప్రాంగణానికి రాగానే సభకు హాజరైన వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. మా తెలుగు తల్లి గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని.. తన సింగపూర్ పర్యటన ఉద్దేశ్యాలను వివరించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ”ప్రపంచంలో మారుతున్న పరిణామాలను తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల జీవితాలను మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 120 పైగా దేశాల్లో తెలుగు ప్రజలు స్థిరపడ్డారు. ఏ దేశానికైనా వెళ్లి గట్టిగా తెలుగులో మాట్లాడితే, అక్కడున్న తెలుగు వారు ఓ పది నిమిషాల్లోనే పోగయ్యే పరిస్థితి వచ్చేసింది. 

ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుగు వాళ్లు వెళ్లడమే కాదు.. ఆయా దేశాల్లోని స్థానికులకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే స్థానికులకంటే.. తెలుగు వారి తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. సత్య నాదెళ్ల లాంటి వాళ్లు మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలకు సేవలు అందిస్తూ... మన తెలుగు వాళ్లు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. సింగపూర్ లో 40 వేల మంది తెలుగు వాళ్లు నివాసం ఉంటున్నారు. 

తెలుగు వాళ్లు ఏయే దేశాల్లో స్థిర పడ్డారో.. ఆ దేశం వారికి కర్మభూమి... అవకాశాలు కల్పించిన ఆ దేశాభివృద్ధి కోసం పని చేయాలి. అదే సమయంలో పుట్టిన గడ్డను తెలుగు వాళ్లు మరువకూడదు. భారతదేశం... ఆంధ్రప్రదేశ్ వారి జన్మభూమి. ఆ జన్మభూమి అభివృద్ధి కోసం తెలుగు వాళ్లు పనిచేయాలి. పెట్టుబడులు పెట్టాలి. అక్కడి పేదలకు చేయూత అందించాలి. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిన పన్నులతో మీరు ఈ స్థాయికి ఎదిగారు... ఎన్నో అవకాశాలు పొందారు. కాబట్టి జన్మభూమి అభివృద్ధికి కృషి చేయడం... పెట్టుబడులు పెట్టడం అనేది బాధ్యతగా తీసుకోవాలి. నేను ఏ దేశం వెళ్లినా... అక్కడి తెలుగు వారిని తప్పకుండా కలుస్తాను” అని సీఎం చెప్పారు.


Chandrababu Naidu
Singapore
Telugu diaspora
Andhra Pradesh development
Investments
Southeast Asia
Telugu people
AP CM
One World International School
NRI

More Telugu News