Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలం: చంద్రబాబు

CM Chandrababu invites Singapore investments in Andhra Pradesh
  • డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీలో విస్తృత అవకాశాలు
  • సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సింగపూర్‌లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న హైకమిషనర్ శిల్పక్ ఆంబులే
  • ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడి
పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు..
సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామిక వేత్తల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హై కమిషనర్ ఆంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలుచేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి  భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను తెలియజేశారు. భారత్‌ తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని వివరించారు. భారత్‌లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ ఏపీ ముఖ్యమంత్రికి తెలిపారు. 

అమరావతి ప్రాజెక్టులో సింగపూర్..
గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని.. కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

పెట్టుబడుల కోసం కొత్త పాలసీలు తెచ్చాం..
వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను చంద్రబాబు భారత హై కమిషనర్‌కు వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం వివరించారు. ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో తొలి క్యాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలియజేశారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

డిఫెన్స్ సంస్థలకు రాయలసీమ అనుకూలం..
రాయలసీమలో డిఫెన్సు, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సింగపూర్ నుంచి భారత్‌ కు పెట్టుబడులు రావాలని దీనికి ఏపీ గేట్ వేగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని హైకమిషనర్ ఆంబులేను సీఎం చంద్రబాబు కోరారు. మరోవైపు సింగపూర్‌లో 83 శాతం మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హై కమిషనర్ వివరించారు. దీనిపై ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. అలాగే విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ఆలోచనల్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భారత హై కమిషనర్‌కు వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి తెలిపిన మంత్రి ఏపీకి త్వరలో తరలివచ్చే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు. 

ఏపీ టెక్ నిపుణులకు ప్రత్యేక డిమాండ్ 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్ నిపుణులకు ఆగ్నేయాసియాలో ప్రత్యేకించి సింగపూర్‌లో డిమాండ్ ఉందని భారత హై కమిషనర్ ఆంబులే సీఎం చంద్రబాబుకు వివరించారు. అమెరికా తరహాలోనే ఆగ్నేసియాలోని సింగపూర్ లాంటి దేశాల విద్యార్ధులను, టెక్ నిపుణులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ముఖ్యమంత్రికి తెలియచేశారు. సింగపూర్ నుంచి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఆయన వివరించారు.

వివిధ రంగాల్లో పెట్టుబడికి అపార అవకాశాలు
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, షిప్ బిల్డింగ్, పోర్టు కార్యకలాపాల నిర్వహణ, డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎంకు వివరించారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దిగ్గజ కంపెనీలు ఎస్టీటీ, కెప్పెల్, కాపిటాల్యాండ్, ఈక్వినిక్స్, పీఎస్ఏ తదితర సంస్థల విస్తరణకు అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఏఐ, స్టార్టప్‌లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం కుదుర్చుకునే అంశంపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ తో పాటు ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh investments
Singapore companies
AP Singapore relations
Green energy AP
Amaravati project
Nara Lokesh
Indian High Commissioner
AP industrial policy
Visakhapatnam

More Telugu News