Kiren Rijiju: స్మోకింగ్ గదిని ఏర్పాటు చేయాలని కోరితే సోమనాథ్ ఛటర్జీ మందలించారు: కిరణ్ రిజిజు

Kiren Rijiju Reveals Somnath Chatterjee Scolded Him Over Smoking Room Request
  • మొదటిసారి భేటీ అయినప్పుడే స్మోకింగ్ గదిని ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడి
  • అలవాటు లేని వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఆ సూచన చేసినట్లు వెల్లడి
  • ఇలాంటి విషయాలు చర్చించడానికి వచ్చారా అని మందలించారన్న కిరణ్ రిజిజు
పార్లమెంటు సభ్యుల కోసం స్మోకింగ్ గదిని ఏర్పాటు చేయాలని తాను గతంలో అప్పటి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీని కోరినప్పుడు ఆయన తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోని అనుభవాలను, ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.

గతంలో సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సమయంలో తాను మొదటిసారిగా ఆయనను కలిశానని తెలిపారు. స్మోకింగ్ గదిని ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. అలా చేస్తే అలవాటు లేనివారికి అసౌకర్యం కలగదని సూచించానని పేర్కొన్నారు.

తన వినతి విన్న సోమనాథ్ ఛటర్జీ, మొదటి సమావేశంలోనే ఇలాంటి విషయాలు చర్చించడానికి వచ్చారా అని తనను మందలించారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నుంచి అత్యున్నత పదవుల్లో ఉన్నవారి దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకువెళ్లాలి, వారితో ఎలా మాట్లాడాలనే విషయాలను తెలుసుకున్నానని ఆయన తెలిపారు.

ప్రజలు ఎంపీలను కలిసినప్పుడు ముఖ్యమైన సమస్యలను వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ తాను సహోద్యోగులుగా భావిస్తానని కిరణ్ రిజిజు అన్నారు.
Kiren Rijiju
Somnath Chatterjee
Smoking room
Parliament
Sansad Ratna Awards

More Telugu News