KTR: ఎక్కడా లేని దిక్కుమాలిన రాజకీయం తెలంగాణలో జరుగుతోంది: బీజేపీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR Slams Revanth Reddy CM Ramesh Over Corruption Allegations
  • రేవంత్ రెడ్డి బావమరిదికి బీజేపీ ప్రభుత్వం అమృత్ కాంట్రాక్టు ఇచ్చిందన్న కేటీఆర్
  • బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్ కాంట్రాక్టు ఇచ్చిందన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్.. ఇద్దరి బాగోతాన్ని బయటపెట్టానన్న కేటీఆర్
దేశంలో ఎక్కడా జరగని అవినీతిపూరిత రాజకీయ కుమ్మక్కు తెలంగాణలో జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ. 1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు.

ఇంతకన్నా దిగజారుడు రాజకీయం, దౌర్భాగ్యపు దందా ఇంకొకటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్ ఇద్దరి బాగోతాన్ని తాను బయటపెట్టడంతో వారిద్దరూ కుడితిలో పడిన ఎలుకలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉనికిలో లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేస్తున్నారని, దానికి రూ.1,660 కోట్ల కాంట్రాక్టు అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

హెచ్‌సీయూ భూములు తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్లు దోచుకున్న దారుణమైన పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారని ఆరోపించారు. తాను ఇదివరకు చెప్పింది ఇప్పుడు నిజమైందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీల దొంగతనం బయటపడటంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు పనికిరాని కట్టుకథలు చెబుతున్నారని ఆరోపించారు.

నిబంధనలను ఉల్లంఘించడం, కాంట్రాక్టులు అనుకున్న వారికే కట్టబెట్టడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన పేర్కొన్నారు. "నీ స్నేహితుడు (రేవంత్ రెడ్డి) 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ రూ. 1,660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయింది" అని సీఎం రమేశ్‌ను ఉద్దేశించి అన్నారు.

ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని, కాబట్టి ఈ పార్టీ ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.

తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ పనికిరాని అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే హెచ్‌సీయూ రూ.10,000 కోట్ల కుంభకోణం, రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కుంభకోణంపై చర్చకు సిద్ధమని తెలిపారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
CM Ramesh
Telangana Politics
BRS
BJP
Congress

More Telugu News