TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌

Pakistan has no objection to America listing TRF as terror group Says Foreign minister Ishaq Dar
  • ఇటీవ‌ల టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా 
  • అగ్ర‌రాజ్యం నిర్ణయంపై తాజాగా స్పందించిన పాకిస్థాన్‌ 
  • టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌
  • ఈ మేరకు ఆ దేశ‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ వెల్లడి
పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)ను ఇటీవ‌ల అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అగ్ర‌రాజ్యం నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్‌ స్పందించింది. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ వెల్లడించారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో నిన్న‌ ఇషాక్‌ దార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాక్‌ మంత్రి మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉంది. యూఎస్‌ నిర్ణయంతో మాకు ఎలాంటి సమస్య లేదు. వారి ప్రమేయం ఉందని ఆధారాలు ఉంటే అలా చేయొచ్చు. మేము స్వాగతిస్తాము’ అని వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇషాక్‌ దార్ తెలిపారు. అయితే, టీఆర్ఎఫ్‌కు లష్కరే తోయిబాకు ముడిపెట్టడం మాత్రం తప్పని ఆయ‌న పేర్కొన్నారు. ఆ సంస్థను తాము కొన్నేళ్ల క్రితమే కూల్చేశామన్నారు.

కాగా, ఏప్రిల్‌ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైసరాన్‌ వ్యాలీలో పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 

మొద‌ట ఈ మారణహోమానికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్‌ ప్రకటించుకుంది. కానీ, ఆ త‌ర్వాత మాట మార్చేసింది. ఇక‌, ఈ దాడి తర్వాత టీఆర్‌ఎఫ్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అటు, 2023 జనవరిలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద భారత్ కూడా టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విష‌యం తెలిసింవ‌దే.
TRF
The Resistance Front
America
Pakistan
Lashkar-e-Taiba
Marko Rubio
Ishaq Dar
Pahalgam Terrorist Attack
Jammu Kashmir
Terrorist Organization

More Telugu News