Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై కదిలిపోయిన సుప్రీంకోర్టు.. నివారణకు సంచలన మార్గదర్శకాలు

Supreme Court issues guidelines on student suicide prevention
  • దేశంలోని ప్రతి 100 ఆత్మహత్యలలో 8 మంది విద్యార్థులు 
  • ఆత్మహత్యల నివారణకు 15 సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు
  • ఎన్‌సీఆర్బీ 2022 డేటా ఆధారంగా జారీ 
  • విశాఖపట్నంలో ‘నీట్’ విద్యార్థి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశం
దేశంలోని విద్యా సంస్థల్లో ఆందోళనకరంగా పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మద్దతు అందించేందుకు ఉద్దేశించిన 15 సమగ్ర మార్గదర్శకాలను సర్వోన్నత న్యాయస్థానం తాజాగా జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడమీలు, హాస్టళ్లు సహా అన్ని విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, సంస్థాగత మద్దతు లోపం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

తప్పనిసరి మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్
"విద్యా సంస్థల్లో తప్పనిసరి మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు, నియంత్రణ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలి" అని సుప్రీంకోర్టులోని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా "పరీక్షల సమయంలో,  విద్యా సంవత్సరం మార్పు సమయంలో చిన్న బ్యాచ్‌లకు ప్రత్యేక కౌన్సెలర్లు లేదా మెంటార్లను నియమించాలి. వారు గోప్యంగా మద్దతును అందించాలి" అని కోర్టు ఉద్ఘాటించింది.

కీలక మార్గదర్శకాల వివరాలు:
సుప్రీంకోర్టు జారీ చేసిన 15 మార్గదర్శకాలలో ముఖ్యమైనవి:

మానసిక ఆరోగ్య శిక్షణ: బోధన, బోధనేతర సిబ్బంది అందరూ సంవత్సరానికి రెండుసార్లు తప్పనిసరి మానసిక ఆరోగ్య శిక్షణ పొందాలి. ఈ శిక్షణలో మానసిక సహాయం, ఒత్తిడి సంకేతాల గుర్తింపు, స్వీయ-హాని సందర్భాల్లో స్పందన, సరైన సహాయానికి రిఫరల్ ప్రక్రియలపై దృష్టి ఉంటుంది.

వివక్ష రహిత విధానం: విద్యార్థులతో సున్నితంగా, సమగ్రంగా వ్యవహరించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

ఫిర్యాదుల కమిటీ: లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఇతర ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి. బాధిత విద్యార్థులకు తక్షణమే మానసిక-సామాజిక మద్దతు అందించాలి.

సెన్సిటైజేషన్ కార్యక్రమాలు: తల్లిదండ్రులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు మానసిక ఆరోగ్య సాక్షరత, భావోద్వేగ నియంత్రణ, జీవన నైపుణ్యాలను విద్యా కార్యకలాపాల్లో భాగంగా చేర్చాలి.

సూసైడ్ హెల్ప్‌లైన్: టెలి-మానస్ వంటి జాతీయ సూసైడ్ హెల్ప్‌లైన్ నంబర్లను హాస్టళ్లు, తరగతి గదులు, సాధారణ ప్రాంతాలు, వెబ్‌సైట్లలో పెద్ద అక్షరాలతో స్పష్టంగా ప్రదర్శించాలి.

వెల్‌నెస్ రికార్డులు: విద్యార్థుల మానసిక ఆరోగ్య రికార్డులను అత్యంత గోప్యంగా నిర్వహించాలి.

ఎన్‌సీఆర్బీ డేటా ఆధారంగా..
ఈ మార్గదర్శకాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) 2022 డేటా ఆధారంగా జారీ చేయబడ్డాయి. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన 1,70,924 ఆత్మహత్యలలో 13,044 విద్యార్థులవి. అంటే ప్రతి 100 ఆత్మహత్యలలో 8 మంది విద్యార్థులు ఉన్నారని ఎన్సీఆర్బీ నివేదించింది. 2001లో ఈ సంఖ్య 5,425గా ఉండగా, 2022లో 2,248 మంది విద్యార్థులు పరీక్షలలో విఫలమైన కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గణాంకాలు విద్యా సంస్థల్లో ఉన్న సిస్టమాటిక్ లోపాలను స్పష్టంగా సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ కేసు నేపథ్యం 
ఈ చారిత్రాత్మక తీర్పు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ‘నీట్’కు సిద్ధమవుతున్న 17 ఏళ్ల విద్యార్థిని 2023 జూలై 14న ఆత్మహత్య చేసుకున్న కేసు సందర్భంగా వెలువడింది. ఆమె తండ్రి సీబీఐ దర్యాప్తు కోరగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2024 ఫిబ్రవరి 14న ఆ దరఖాస్తును తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తండ్రి ఫిర్యాదుతో కోర్టు ఇప్పుడు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 , 141 ప్రకారం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు తగిన చట్టం రూపొందించే వరకు ఇవి చట్టంగా అమలులో ఉంటాయి. ఈ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రవీంద్ర ఎస్ భట్ నేతృత్వంలోని విద్యార్థుల మానసిక ఆరోగ్య జాతీయ టాస్క్ ఫోర్స్ పనిని మరింత బలపరుస్తాయని కోర్టు తెలిపింది. 
Supreme Court
student suicides
India
mental health
Visakhapatnam
NEET
education
NCRB
suicide prevention
Andhra Pradesh

More Telugu News