Thailand Cambodia Conflict: దక్షిణాసియాలో మరో యుద్ధం.. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య భీకర ఘర్షణ

Thailand Cambodia Conflict Intensifies Border Clashes Escalate
  • ఇరు దేశాల మధ్య ముదురుతున్న ఘర్షణలు
  • పెరుగుతున్న నిరాశ్రయులు
  • 800 కిలోమీటర్ల సరిహద్దుపై ఏళ్లుగా వివాదం
థాయ్‌లాండ్, కంబోడియా సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండో రోజు కూడా ఘర్షణలు తీవ్రమయ్యాయి. కంబోడియా సైన్యం ఆర్టిలరీ, రాకెట్లతో భారీ ఆయుధాలను ఉపయోగించినట్టు థాయ్‌లాండ్ సైన్యం పేర్కొంది. ఈ సరిహద్దు వివాదం కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య పెరుగుతోంది.

థాయ్‌లాండ్ సైన్యం కథనం ప్రకారం.. కంబోడియా దళాలు ఫీల్డ్ ఆర్టిలరీ, బీఎం-21 రాకెట్ సిస్టంలను ఉపయోగించి బాంబు దాడులకు దిగాయి. థాయ్ దళాలు యుద్ధ వ్యూహానికి అనుగుణంగా స్పందించాయి. గత దశాబ్దంలో జరిగిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఘర్షణల కారణంగా నాలుగు సరిహద్దు ప్రావిన్స్‌ల నుంచి 100,000 మందికి పైగా ప్రజలను దాదాపు 300 తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలించారు.

థాయ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఘర్షణలలో మరణాల సంఖ్య 14కు చేరింది. వీరిలో 13 మంది పౌరులు, ఒక సైనికుడు ఉన్నారు. ఈ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. తక్షణమే కాల్పుల విరమణకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.

థాయ్ భూభాగంపై కంబోడియా రాకెట్లు, ఆర్టిలరీని ప్రయోగించగా.. థాయ్‌లాండ్ ఎఫ్-16 ఫైటర్ జెట్లను ఉపయోగించి సరిహద్దు ఆవల సైనిక లక్ష్యాలపై దాడులకు దిగింది. ఐదుగురు థాయ్ సైనికులు ల్యాండ్‌మైన్ పేలుడులో గాయపడటంతో కంబోడియా రాయబారిని థాయ్‌లాండ్ బహిష్కరించింది. 

దీర్ఘకాలిక వివాదం
800 కిలోమీటర్ల (500 మైళ్ల) సరిహద్దుపై ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా వివాదం ఉంది. 2008 నుంచి 2011 వరకు జరిగిన ఘర్షణలలో కనీసం 28 మంది మరణించారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. 2013లో ఐక్యరాజ్యసమితి కోర్టు తీర్మానం ఈ సరిహద్దు వివాదాన్ని ఒక దశాబ్దం పాటు నియంత్రణలో ఉంచింది. అయితే, మే నెలలో ఒక కంబోడియా సైనికుడు తాజా ఘర్షణలో మరణించడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ రెండు దేశాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
Thailand Cambodia Conflict
Thailand
Cambodia
Border Dispute
Military Clash
South Asia War
UN Security Council
Fighter Jets
Landmine
Refugees

More Telugu News