Govindaswamy: సౌమ్య రేప్, హత్య కేసు నిందితుడు గోవిందస్వామి కన్నూర్ జైలు నుంచి పరారీ

Govindaswamy Escapes from Kannur Jail in Soumya Rape Murder Case
  • ఇనుప చువ్వలు కట్‌చేసి, జైలు గోడ దూకి పరారీ
  • ఒంటి చేయి గోవిందస్వామి జైలు గోడ దూకడంపై అనుమానం
  • సౌమ్యపై హత్యాచారం కేసులో దోషికి జీవితఖైదు
  • గోవిందస్వామి కోసం రంగంలోకి పోలీసులు
సౌమ్యపై అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు గోవిందస్వామి ఈ ఉదయం కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందస్వామి జైలులోని 10వ బ్లాక్‌లోని ఒక సెల్‌లో ఉన్నాడు. తన సెల్‌లోని కాస్ట్ ఐరన్ బార్‌లను కత్తిరించడానికి రంపం వంటి సాధనాన్ని ఉపయోగించాడని నివేదికలు చెప్తున్నాయి. గోవిందస్వామికి ఒక చేయి లేదు. "ఒక చేయి ఉన్న గోవిందస్వామి అత్యంత భద్రత కలిగిన సెంట్రల్ జైలు భారీ గోడను (సుమారు ఏడున్నర మీటర్ల ఎత్తు, పైన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో) దాటడం అత్యంత అనుమానాస్పదంగా ఉంది" అని పోలీసులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు సెల్ మూసివేసినప్పుడు అతడు లోపలికి వెళ్లలేదని అనుమానించారు. అయితే, సీసీటీవీ ఫుటేజ్‌లో అతను తన సెల్ నుంచి బయటకు వస్తున్నట్టు కనిపించాడు.

సౌమ్య కేసు వివరాలు
23 ఏళ్ల సౌమ్య రేప్, హత్య కేసులో గోవిందస్వామి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ దారుణ ఘటన 2011 ఫిబ్రవరి 1న జరిగింది. కొచ్చిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న సౌమ్య, ఎర్నాకులం నుంచి షొరనూర్‌కు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలులో గోవిందస్వామి చేతిలో హత్యాచారానికి గురైంది.

ప్రాసిక్యూషన్ ప్రకారం.. గోవిందస్వామి లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉన్న సౌమ్యను గమనించాడు. వల్లతోల్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన వెంటనే అతడు ఆమెపై దాడి చేసి, ఆమె తలను కంపార్ట్‌మెంట్ గోడలకు పదేపదే కొట్టి, నడుస్తున్న ట్రైన్ నుంచి బయటకు విసిరాడు. అనంతరం అతడు కూడా నెమ్మదిగా నడుస్తున్న రైలు నుంచి దూకాడు. అనంతరం రైల్వే ట్రాక్‌ల సమీపంలో పడి ఉన్న సౌమ్యను సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న సౌమ్య 2011 ఫిబ్రవరి 6న త్రిస్సూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మరణించింది. గోవిందస్వామిని మరుసటి రోజు పాలక్కడ్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు
సుప్రీంకోర్టు 2016లో గోవిందస్వామికి విధించిన మరణ శిక్షను రద్దు చేసింది. "ఒక చేయి ఉన్న గోవిందస్వామి ఆమెను రైలు నుంచి నెట్టగలిగాడా?" అనే సందేహాన్ని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యక్తం చేసింది. నిందితుడికి ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ ఇస్తూ హత్య ఆరోపణను తొలగించింది. హైకోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేసింది. అయితే, రేప్ కేసు అని నిర్ధారించబడింది కాబట్టి, హైకోర్టు ఇచ్చిన జీవిత ఖైదు శిక్ష, ఇతర విభాగాల కింద ఇచ్చిన శిక్షలు అమలులో ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Govindaswamy
Soumya rape case
Kannur jail escape
Kerala crime news
Soumya murder case
Supreme Court verdict
Indian Penal Code
jailbreak
crime news telugu
Kannur central jail

More Telugu News