Revanth Reddy: ప్రియాంక గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

Revanth Reddy Meets Priyanka Gandhi Discusses Telangana Issues
  • రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి
  • కులగణన వివరాలను ప్రియాంక గాంధీతో పంచుకున్న ముఖ్యమంత్రి
  • బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించేందుకు అండగా ఉంటామని ప్రియాంక హామీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని కలిశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురితో సమావేశమవుతున్నారు. ప్రియాంక గాంధీతో భేటీ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.

ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రియాంక గాంధీ అభినందించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు తాము అండగా ఉంటామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీతో కలిసిన ఫొటోను రేవంత్ రెడ్డి 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు.

మోదీ పుట్టుకతో బీసీ కాదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే విధానంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కులగణన సర్వే దేశానికి దిక్సూచిలా నిలుస్తుందని అన్నారు. ఈ సర్వేపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వచ్చిందని, పరిస్థితులను బట్టి ముందుకు సాగాలని చెప్పి వారిని ఒప్పించామని తెలిపారు. నరేంద్ర మోదీ బీసీల కోసం ఏమీ చేయరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలను చేస్తోందని అన్నారు.
Revanth Reddy
Priyanka Gandhi
Telangana CM
Telangana Politics
Caste Census
OBC Reservations

More Telugu News