Chandrababu Naidu: ఈ నెల 26 నుంచి సింగపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu to Tour Singapore for Investments
  • 6 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్న చంద్రబాబు
  • కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు రెండో విదేశీ పర్యటన
  • బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన సింగపూర్ లో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం... రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళుతున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరించి పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు.

పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. 

మొదటి రోజు... సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.

 విశాఖ పెట్టుబడుల సదస్సు లక్ష్యంగా...

ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు గానూ ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. 

డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు.

 

Chandrababu Naidu
Andhra Pradesh
Singapore
Investments
AP Investment Summit
Visakha Investment Summit
Telugu Diaspora
Singapore Tour
AP Industrial Policy
Brand AP

More Telugu News