Chandrababu Naidu: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Chandrababu Naidu Green Signal for Filling 150 Posts in IPM
  • ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెరగాలన్న సీఎం
  • అవసరం లేకున్నా సిజేరియన్లు సరికాదన్న సీఎం చంద్రబాబు
  • సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించిన సీఎం
మెరుగైన వైద్య సేవలందించడమే కాకుండా, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రజల ఆహారపు అలవాట్ల నుంచి ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం వరకు కార్యాచరణ అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని, ఈ భారం తగ్గాలంటే ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లను కొనసాగిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, పురుగు మందులు లేని ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ దిశగా రైతులు, ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.

అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడం సరికాదని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండాలనే ప్రభుత్వ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి వైద్య సేవలు అందించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దాలని తెలిపారు. అవసరమైతే ఔట్ సోర్సింగ్ సేవలు తీసుకోవాలని, మెడికల్ కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్పారు.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్‌లో పోస్టులను భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రిని కోరారు. 723 పోస్టులకు గానూ కేవలం 143 మంది మాత్రమే ఉన్నారని మంత్రి చెప్పడంతో, ముందుగా 150 పోస్టులను భర్తీ చేసేలా ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు చేసే అంశంపై ఉన్న సమస్యను పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Healthcare
Medical Services
Satyakumar Yadav
Medical Jobs
Preventive Medicine
Government Hospitals
Organic Products
Medical Colleges

More Telugu News