Cyber Crime: బెంగళూరులో షాకింగ్ సైబర్ మోసం: 'డిజిటల్ అరెస్ట్' పేరుతో 9 గంటలపాటు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టారు!

Cyber Crime Bengaluru Women Forced Nude in Digital Arrest Scam
  • స్నేహితురాలిని కలిసేందుకు థాయ్‌లాండ్ నుంచి వచ్చిన మహిళ
  • జెట్ ఎయిర్‌వేస్ అక్రమ నగదు బదిలీలో పాల్గొన్నారంటూ మహిళకు ఫోన్ 
  • డిజిటల్ అరెస్ట్ పేరుతో కొన్ని గంటలపాటు నరకయాతన
  • ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 58,477 బదిలీ
బెంగళూరులో అత్యంత దారుణమైన సైబర్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ నేరగాడు ఇద్దరు మహిళలను ఏకంగా 9 గంటల పాటు వీడియో కాల్‌లో బంధించి, నగ్నంగా కూర్చోబెట్టి బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన మారతహళ్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

థాయ్‌లాండ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ తన స్నేహితురాలిని కలిసేందుకు ఈ నెల 17న బెంగళూరు వచ్చారు. ఆ సమయంలో ఆమెకు ఓ అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాము పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుని, జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన అక్రమ నగదు బదిలీలో మీరు పాల్గొన్నారని, తక్షణమే కొలాబా పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని బెదిరించాడు. తాను చాలా సంవత్సరాలుగా భారత్‌లో లేనని ఆమె వివరించినప్పటికీ, నేరగాడు 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. చివరకు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 58,477 బదిలీ చేయించుకున్నాడు.

నగ్నంగా మారమని బెదిరింపులు.. 9 గంటల టెర్రర్
డబ్బు బదిలీ చేయించుకున్న తర్వాత కూడా నేరగాడు ఆగలేదు. బాధితురాలు, ఆమె స్నేహితురాలిని వాట్సాప్ వీడియో కాల్‌లోకి రమ్మని ఆదేశించాడు. "గుర్తింపు కోసం పుట్టుమచ్చలు చూడాలి" అని చెప్పి, ఇద్దరినీ నగ్నంగా మారమని బెదిరించాడు. సుమారు 9 గంటల పాటు ఈ బెదిరింపులు కొనసాగాయి. నిందితుడు కాల్‌ను కట్ చేయకపోవడంతో, చివరకు బాధిత మహిళలు ధైర్యం చేసి ఫోన్‌ను ఆఫ్ చేశారు. కొంత సమయం తర్వాత తాము మోసపోయామని గ్రహించిన బాధితులు, బెంగళూరు తూర్పు విభాగం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల చర్యలు.. ప్రజలకు హెచ్చరిక
ఈ ఘటనపై నిన్న కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... "డిజిటల్ అరెస్ట్ అనేది నీటిమీద నురగలాంటిది. అలాంటి బెదిరింపులను ప్రజలు అస్సలు నమ్మవద్దు" అని కోరారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కాల్స్‌ను వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు నివేదించాలని కోరారు. ఈ దారుణ ఘటన సైబర్ భద్రతపై అవగాహన ఎంత అవసరమో మరోసారి నొక్కి చెప్పింది.
Cyber Crime
Bengaluru cyber crime
Digital arrest
cyber fraud
cyber blackmail
Seemanth Kumar Singh
cyber security awareness
cyber police
cyber crime helpline 1930
online fraud

More Telugu News