Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న వాన విలయం

Himachal Pradesh Floods Cause Havoc and Casualties
  • హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు 77 మంది మృతి, 34 మంది గల్లంతు
  • కొండచరియలు విరిగిపడి రోడ్లపై శిథిలాలు 
  • రెండు జాతీయ రహదారులతో పాటు మొత్తం 345 రోడ్లను మూసివేసిన వైనం
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు 77 మంది మృతి చెందగా, 34 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా రెండు జాతీయ రహదారులతో పాటు మొత్తం 345 రోడ్లను మూసివేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి శిథిలాలు రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మండి జిల్లాలో 232 రోడ్లను, కుల్లు జిల్లాలో 71 రహదారులను మూసివేసినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఈఓసీ) అధికారులు వెల్లడించారు. దీనితో పాటు 169 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు శిమ్లాలోని కసుంష్టి ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోవడంతో ఆ పాఠశాల ప్రమాదకరంగా మారింది. దీంతో అక్కడి 65 మంది విద్యార్థులను సమీపంలోని కమ్యూనిటీ సెంటర్‌కు తరలించారు. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో 42 ఆకస్మిక వరదలు సంభవించాయి, అలాగే 26 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దీని ఫలితంగా దాదాపు రూ.1,362 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 285.2 మిమీ కాగా, 14 శాతం అధికంగా 324.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 
Himachal Pradesh Floods
Himachal Pradesh
Floods
Landslides
Rainfall
National Highways
Mandi District
Shimla
Disaster Management

More Telugu News