Bangalore: బెంగళూరు బస్టాండులో ప్లాస్టిక్ బ్యాగులో పేలుడు పదార్థాల కలకలం

Explosives Found at Bangalore Bus Stand
  • కలాసిపాళ్యం బస్టాండ్ టాయిలెట్ సమీపంలో ప్లాస్టిక్ బ్యాగులో పేలుడు పదార్థాలు
  • ఆరు జిలెటిన్ స్టిక్స్, కొన్ని డిటోనేటర్ల గుర్తింపు
  • క్వారీలలో బండలను పగులగొట్టేందుకు తీసుకు వెళుతుండవచ్చునని అనుమానం
కర్ణాటక రాజధాని బెంగళూరులోని బస్టాండ్ వద్ద పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. కలాసిపాళ్యం బస్టాండ్ టాయిలెట్‌ సమీపంలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఆరు జిలెటిన్ స్టిక్స్, కొన్ని డిటోనేటర్లను గుర్తించారు. బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు లభ్యమవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

"ఒక బ్యాగులో పేలుడు పదార్థాలను గుర్తించాం. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు" అని బెంగళూరు పోలీసు అధికారి గిరీశ్ మీడియాకు తెలిపారు. బాంబు నిర్వీర్య బృందం, పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

బస్టాండ్‌లోని ప్రయాణికులను, దుకాణదారులను బయటకు పంపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. బెంగళూరు నుంచి తమిళనాడులోని హోసూరు, కృష్ణగిరి ప్రాంతాల్లోని క్వారీలలో బండలను పగలగొట్టేందుకు ఈ జిలెటిన్ స్టిక్స్‌ను తీసుకువెళుతుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
Bangalore
Bangalore bus stand
Karnataka
Gelatin sticks
Detonators
Explosives

More Telugu News