Donald Trump: అమెరికా నోట మళ్లీ అదే మాట.. భారత్-పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారట!

India Rejects US Claim on Role in Easing India Pakistan Tensions
  • భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర పోషించందన్న ఆ దేశ ప్రతినిధి
  • ఉద్రిక్తతలు తీవ్రమైతే రెండు దేశాలతోనూ వాణిజ్యాన్ని నిలిపి వేస్తామని ట్రంప్ హెచ్చరించారన్న వైనం
  • తీవ్రంగా ఖండించిన భారత్
  • కాల్పుల విరమణ భారత్-పాక్ మధ్య జరిగిన చర్చల ఫలితమేనని స్పష్టీకరణ
భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల తగ్గింపులో తమ పాత్ర కీలకమని అమెరికా మరోసారి పేర్కొనగా, భారతదేశం దీనిని గట్టిగా ఖండించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం అనేది కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమేనని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)లో జరిగిన బహిరంగ చర్చలో ఈ దౌత్యపరమైన వివాదం చోటుచేసుకుంది.

ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి, రాయబారి డోరతీ షియా.. పాకిస్థాన్ అధ్యక్షతన జరిగిన 'మల్టీలాటరలిజం- శాంతియుత వివాద పరిష్కారం' అనే చర్చలో మాట్లాడుతూ గత మూడు నెలల్లో ఇజ్రాయెల్-ఇరాన్, కాంగో-రువాండా, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ తమ పరిపాలన భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడిందని, ఒకవేళ ఈ ఉద్రిక్తతలు తీవ్రమైతే రెండు దేశాలతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని హెచ్చరించినట్టు పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. 
 
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ అమెరికా వాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు. ఈ ఆపరేషన్‌లో భారత్, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సంయమనపూర్వక చర్యలు చేపట్టినట్టు వివరించారు.

"ప్రధాన లక్ష్యాలు సాధించిన తర్వాత పాకిస్థాన్ అభ్యర్థన మేరకు సైనిక కార్యకలాపాలను నిలిపివేశాం" అని హరీశ్ వివరించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ సమయంలో మే 10న జరిగిన ఒప్పందం రెండు దేశాల సైనిక అధికారుల మధ్య (పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) నేరుగా భారత డీజీఎంవోతో జరిగిన చర్చల ఫలితమే కాల్పుల విరమణ ఒప్పందమని ఆయన స్పష్టం చేశారు.
Donald Trump
India Pakistan
India Pakistan conflict
UNSC
Parvataneni Harish
Operation Sindoor
Ceasefire agreement
Jammu Kashmir
POK
America

More Telugu News