Ramakrishna: ఎవరడిగారని స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna Questions Smart Meter Installation in Andhra Pradesh
  • కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15వేల కోట్ల విద్యుత్ భారం మోపిందన్న సీపీఐ రామకృష్ణ
  • ఆదానీతో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్న రామకృష్ణ
  • వైసీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం డబుల్ అప్పులు చేస్తుందన్న రామకృష్ణ
స్మార్ట్ మీటర్లను ఎవరి అనుమతితో బిగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీపీఐ కడప జిల్లా 25వ మహాసభలు బద్వేలు పట్టణంలో నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని కూడా పిలుపునిచ్చారని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలపై రూ.15,480 కోట్ల విద్యుత్ భారం మోపారని విమర్శించారు. అదానీతో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందంతో 25 ఏళ్లలో ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని, అందువల్ల ఈ ఒప్పందాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగిస్తే ప్రజలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ విధానాలను తెలుగుదేశం, జనసేన పార్టీలు భుజానికి ఎత్తుకొని మోస్తున్నాయని విమర్శించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మత ప్రాతిపదికన మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే టీడీపీ ఏం సాధించిందని రామకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెట్టింపు అప్పులు చేస్తుందని ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.31వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో లక్షా 75 వేల కోట్లు అప్పులు చేసిందని అన్నారు. 
Ramakrishna
CPI Ramakrishna
Smart Meters
Andhra Pradesh Electricity
AP Electricity Charges
TDP
Chandrababu Naidu
Lokesh
Adani
SECI

More Telugu News