Harivansh: కీలక పరిణామం... రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్

Harivansh Meets President Droupadi Murmu Key Development
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్
  • ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేసిన రాష్ట్రపతి భవన్
  • ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో రాజ్యసభ కార్యకలాపాలు చూసుకోనున్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్       
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిన్న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన మరుసటి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ రాష్ట్రపతిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆరోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేసినట్టు జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నప్పటికీ, ఆయన రాజీనామాపై పలు ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జగదీప్ ధన్‌ఖడ్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే తన పదవికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, రాష్ట్రపతి భవన్ 'ఎక్స్' ఖాతాలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీకి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.

ఉపరాష్ట్రపతి రాజీనామాతో రాజ్యసభ ఛైర్మన్ పదవి సైతం ఆటోమెటిక్‌గా ఖాళీ అయింది. ఉపరాష్ట్రపతి ఎగువ సభకు ఎక్స్ అఫిషియో ఛైర్మన్. ఈ పరిస్థితుల్లో ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ కార్యకలాపాలు మొత్తం డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ చూసుకోనున్నారు. 
Harivansh
Droupadi Murmu
Rajya Sabha
Vice President
Jagdeep Dhankhar
President of India
Parliament
Rajya Sabha Deputy Chairman
Indian Politics
Resignation

More Telugu News