India Pakistan Relations: పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌

India extends ban on Pakistan flights in Indian airspace
  • ఆగస్టు 23 వరకు పాక్‌ విమానాల‌పై బ్యాన్ పొడిగింపు
  • కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ప్ర‌క‌ట‌న‌
  • ఆగస్టు 24 వరకు భార‌త‌ ఎయిర్‌లైన్స్‌పై నిషేధాన్ని పొడిగించిన పాక్‌
భారత్ తన గగనతలాన్ని ఉపయోగించి పాకిస్థాన్ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 23 వరకు పాక్‌ విమానాలు భార‌త‌ గగనతలంలోకి ప్రవేశించకుండా బ్యాన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. 

“పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా పరిమితం చేస్తున్న ఎయిర్‌మెన్ నోటీసు (NOTAM)ను అధికారికంగా ఆగస్టు 23 వరకు పొడిగించడం జ‌రిగింది. ప్రస్తుత భద్రతా ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఇది ఉంటుంది” అని మంత్రి తెలిపారు.

దాయాది దేశం తన గగనతలంలో భారతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ గ‌త వారం తీసుకున్న‌ నిర్ణయాన్ని అనుసరించి భార‌త్ ఈ చర్య తీసుకుంది. ఆగస్టు 24 వరకు భార‌త‌ ఎయిర్‌లైన్స్‌పై బ్యాన్‌ను పొడిగించినట్లు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ (పీఏఏ)  గత వారం ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ నిషేధం భార‌త సైనిక‌, పౌర విమానాల‌న్నింటికీ వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. ఈ బ్యాన్‌ ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) అమలులో ఉంటుందని పీఏఏ తెలియ‌జేసింది.

మొద‌ట‌ ఈ నెల‌ 24 వరకు పాకిస్థాన్ విమానాలకు భారత్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఇండియా తొలుత‌ ఏప్రిల్ 30న ఈ ఆంక్షలను విధించింది. ఆ త‌ర్వాత ఈ బ్యాన్‌ను జులై 24 వ‌ర‌కు పొడిగించింది. ఈ గ‌డువును ఇప్పుడు మ‌ళ్లీ ఆగ‌స్టు 23 వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 
India Pakistan Relations
Pakistan flights ban
Indian airspace
aviation news
airport authority
security protocol
flight restrictions
air travel
Muraleedhar Mohol

More Telugu News