Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు

Kavitha Criticizes CM Revanth Reddy on BC Reservations
  • రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా
  • ఢిల్లీకి వెళ్లడంలో అర్ధ సెంచరీ సాధించారన్న కవిత
  • బీసీ రిజర్వేషన్లపై జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళుతున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి గట్టిగా మాట్లాడాలని సూచించారు.

హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, అయితే బీసీలు పార్టీల పరంగా రిజర్వేషన్లు కోరుకోవడం లేదని తెలిపారు. చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను వారు కోరుకుంటున్నారని తెలిపారు. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బీసీ బిడ్డలు వారిని వదిలి పెట్టరని హెచ్చరించారు.

బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతున్న మాటలు బాధాకరమని అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి గతంలోనే పంపించినప్పటికీ రాష్ట్రపతి వద్ద పెండింగులో పెట్టి తిరిగి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లుకు మతపరమైన రంగు పులిమి బీజేపీ బిల్లును పాస్ చేయడం లేదని విమర్శించారు. గుజరాత్‌లో ఎలాంటి రిజర్వేషన్లు ఇచ్చారో అందరికీ తెలుసని, తెలంగాణ విషయంలో మాత్రం బీజేపీ మరో రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ 50 శాతానికి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తోందని కవిత వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి న్యాయస్థానాల పరిధిలో ఉందని సాకులు చెబుతోందని విమర్శించారు. బీసీ బిడ్డలను రిజర్వేషన్లకు దూరంగా ఉంచాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Kavitha
MLC Kavitha
Revanth Reddy
BC Reservations
Telangana Politics
BJP

More Telugu News