Natti Kumar: ఫిష్ వెంకట్ వ్యవహారంపై నట్టికుమార్ స్పందన

Natti Kumar Reacts to Fish Venkat Demise
  • ఫిష్ వెంకట్ అసోసియేషన్‌లో సభ్యుడేకాదన్న నట్టికుమార్
  • సినిమా అంటేనే ఒక బిజీ ప్రపంచం, ఎవరి పనిలో వారు ఉంటారన్న నట్టికుమార్
  • రోజుకు రూ.30వేల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడన్న నట్టికుమార్
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణానంతరం సినీ పరిశ్రమపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆర్థిక సహాయం కోసం ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినా పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదని, మరణించిన తర్వాత కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలపలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై తాజాగా నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారని తెలిపారు. పరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నవారు మరణిస్తేనే సినీ ప్రముఖులు అక్కడ కనిపిస్తారని అన్నారు. సినిమా అంటేనే ఒక బిజీ ప్రపంచమని, ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ఇక్కడ ఎవరు మరణించారనే విషయం తెలుసుకునేంత సమయం కూడా ఎవరికీ ఉండదని ఆయన అన్నారు. తాను చెబుతున్న మాటలు ఫిష్ వెంకట్ కుటుంబంతో పాటు ప్రేక్షకులకు కూడా బాధ కలిగించవచ్చని, కానీ రేపు తనకెలాంటి పరిస్థితి వచ్చినా ఇంతేనని కుండబద్దలు కొట్టారు.

చిత్ర పరిశ్రమలో కొన్ని సామాజిక వర్గాలు, ఫిల్మ్ ఛాంబర్‌తో నిత్యం సంబంధాలు ఉన్నవారికి ఏదైనా జరిగితే వారి సన్నిహితులు తప్పకుండా వెళ్తారని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్‌తో ఫిష్ వెంకట్‌కు పరిచయాలు ఉండడం వల్లనే వారు ఆయనతో కనిపిస్తున్నారని, మిగిలినవారు కనీసం అయ్యో పాపం అని కూడా అనరని ఆయన అన్నారు.

వెంకట్‌ను ఎవరూ పలకరించలేదని చాలామంది బాధపడుతున్నారని, కానీ ఆయన అసలు అసోసియేషన్ సభ్యుడే కాదని, సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీలో సాయం చేస్తారని ఎవరూ ఆశించవద్దని, ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలో తాము ఉండాలని హితవు పలికారు.

రోజుకు మూడు వేల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయి నుంచి రూ.30 వేలకు వెంకట్ ఎదిగారని నట్టికుమార్ గుర్తు చేశారు. డబ్బు ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారని ఆయన తేల్చి చెప్పారు.

ఈ విషయంలో ఎవరినీ తప్పుపట్టడం సరికాదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. లేనివాడికి ప్రాణం మీద ప్రేమ, ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ ఉంటుందని, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని అన్నారు. మాట సాయం చేయగలరేమో కానీ ఆర్థిక సహాయం మాత్రం అందరూ చేయలేరని ఆయన అన్నారు. 
Natti Kumar
Fish Venkat
Tollywood
Telugu Film Industry
Gabbar Singh
Movie Association
Film Chamber
Actor Death
Kidney Disease
Remuneration

More Telugu News