Harbhajan Singh: శ్రీశాంత్ కూతురు అన్న మాటలకు నా కళ్లు చెమ్మగిల్లాయి.. హర్భజన్ సింగ్

Harbhajan Singh Tearful About Sreesanths Daughters Words
  • మా నాన్నను కొట్టావు.. నీతో మాట్లాడను పొమ్మన్న చిన్నారి
  • ఆ చెంపదెబ్బ సంఘటన నన్ను జీవితాంతం వెంటాడుతుందన్న భజ్జీ
  • తాను అలా చేసి ఉండాల్సింది కాదని పశ్చాత్తాపం
  • సందర్భం వచ్చిన ప్రతిసారీ సారీ చెబుతూనే ఉన్నానని వివరణ
ఐపీఎల్ మొట్టమొదటి సీజన్ లో శ్రీశాంత్ ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు పదిహేడేళ్లు గడిచిపోయినా ఈ ఘటన ఇప్పటికీ, ఆ మాటకొస్తే జీవితాంతం తనను వెంటాడుతూనే ఉంటుందని హర్భజన్ సింగ్ చెప్పారు. ఈ ఘటనపై శ్రీశాంత్ కూతురు అన్న మాటతో తన కళ్లు చెమర్చాయని అన్నారు. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ లో భజ్జీ మాట్లాడుతూ మరోసారి ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

అప్పుడు అలా చేసి ఉండకూడదని వందలసార్లు అనుకున్నానని వివరించాడు. సందర్భం వచ్చిన ప్రతిసారీ, ప్రతీ వేదికపైనా శ్రీశాంత్ కు క్షమాపణ చెబుతున్నానని గుర్తుచేశారు. ఇప్పటి వరకు 200 సార్లు సారీ చెప్పి ఉంటానని భజ్జీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ.. ‘జీవితంలో ఏదైనా మార్చుకొనే అవకాశం వస్తే శ్రీశాంత్‌తో జరిగిన ఘటనను సరిదిద్దుకుంటా. నా కెరీర్‌ నుంచి దానిని తొలగిస్తా. తప్పులు చేయడం సహజమే. కానీ, వాటిని పునరావృతం చేయకూడదు. మేమిద్దరం కలిసి ఆడాం. కానీ, ఆ మ్యాచ్‌లో మేం ప్రత్యర్థులం. శ్రీశాంత్ రెచ్చగొట్టాడు.. అయినా నేను కాస్త సంయమనం పాటించాల్సింది. అందులో తప్పు నాదే. అలా చేయాల్సింది కాదు. ఆ తర్వాత శ్రీశాంత్ కు సారీ చెప్పా’ అని తెలిపారు.

ఆ ఘటన జరిగిన చాలా ఏళ్లకు శ్రీశాంత్‌ కుమార్తెను ఓ సందర్భంలో కలిసినట్లు హర్భజన్ చెప్పారు. ఆమెతో ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నించాను కానీ ఆ చిన్నారి మాత్రం తనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదన్నారు. ‘మా నాన్నను కొట్టావు నీతో మాట్లాడను పొమ్మంది’. ఆ చిన్నారి మాటలకు తన కళ్లు చెమర్చాయన్నారు. ‘ఆ పాప నన్ను ఓ దుర్మార్గుడిగా, తన తండ్రిని కొట్టిన వ్యక్తిగానే చూస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆ చిన్నారికి క్షమాపణలు చెప్పడం తప్ప ఇంకేం చేయలేనని అన్నారు. ఆ పాప మనసులో తనపై ఏర్పడిన అభిప్రాయాన్ని మార్చడానికి ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని తెలిపారు. ‘ఆ పాప పెద్దయ్యాక నన్ను ఓ దుర్మార్గుడిగా చూడకూడదని భావిస్తున్నాను. ఒక అంకుల్‌గా ఆ చిన్నారికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాను’ అని హర్భజన్‌ చెప్పారు.
Harbhajan Singh
Sreesanth
IPL
Indian Cricket
Ravichandran Ashwin
Sreesanth daughter
Cricket controversy
Harbhajan apology
Cricket news
Bhajji

More Telugu News