Adilabad: పోలీసులపై ముల్తానీల రాళ్ల దాడి .. 9 మందికి గాయాలు

Adilabad Stone Pelting on Police by Multanis 9 Injured
  • అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను తీసేస్తున్న ముల్తానీలు
  • ప్రభుత్వ భూముల్లోకి రావద్దంటూ ముల్తానీలకు సూచించిన అధికారులు
  • పోలీసులపై రాళ్ల దాడి చేసిన ముల్తానీలు
  • ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఘటన
పోడు భూముల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులపై రాళ్ల దాడి జరగడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవ్ పట్నంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, అటవీ ప్రాంతంలో నాలుగైదు రోజులుగా అధికారులు మొక్కలు నాటుతుండగా, ముల్తానీలు వాటిని పీకేస్తున్నారు. సిరిచెల్మ రేంజ్ పరిధిలోని కేశవ్‌పట్నం అటవీ ప్రాంతం 172, 174 కంపార్ట్‌మెంట్‌లో పోలీసుల సహకారంతో వెళ్ళిన అధికారులు, ముల్తానీలను అడ్డుకొని ప్రభుత్వ భూముల్లోకి రావొద్దని సూచించారు.

ఆ భూములు తమవేనని ముల్తానీలు పేర్కొన్నారు. సంబంధిత పత్రాలు చూపించాలని అధికారులు అడుగగా, తమ భూముల జోలికి వస్తే ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటామని కొందరు మహిళా రైతులు హెచ్చరించారు. దీంతో అధికారులు వెనుతిరిగారు.

మళ్ళీ నిన్న గ్రామంలోకి పోలీసులు, అటవీ సిబ్బంది వెళ్ళగా, గ్రామస్తులు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో తొమ్మిది మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
Adilabad
Keshavpatnam
Telangana
Podu Lands
Forest Department
Police Attack
Stone Pelting
Land Dispute
Ichoda Mandal
Akhil Mahajan

More Telugu News