Obama arrest: ఒబామాను అరెస్టు చేస్తున్నట్లు ట్రంప్ షేర్ చేసిన ఏఐ వీడియో

Donald Trump Shares AI Video of Barack Obamas Arrest
  • చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదన్న అమెరికా అధ్యక్షుడు
  • ఒబామాను జైలులో పెడుతున్న ఏఐ వీడియో పోస్ట్ చేసిన ట్రంప్
  • 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కుట్ర చేశారని ఒబామాపై ఆరోపణలు
అమెరికాలో చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా ఊచలు లెక్కబెట్టాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో మాజీ అధ్యక్షులతో పాటు పదవిలో ఉన్న అధ్యక్షులకూ మినహాయింపు లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) అధికారులు అరెస్టు చేస్తున్న వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో పంచుకున్నారు. ఈ వీడియోను కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) సాయంతో సృష్టించారు.

అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చర్చిస్తూ ఉండగా ఇద్దరు ఎఫ్ బీఐ అధికారులు అక్కడికి వస్తారు.. ఒబామా చేతులకు బేడీలు వేసి అక్కడి నుంచి తీసుకెళతారు. అంతకుముందు మాజీ అధ్యక్షులు, సీనియర్ చట్ట సభ్యులు ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదు’ అని చెప్పడం కనిపిస్తుంది. ఒబామాను జైలుకు తరలించిన అధికారులు ఆయనకు ఖైదీ దుస్తులు తొడిగి సెల్ లోకి పంపిస్తారు.

ఖైదీ దుస్తుల్లో ఒబామా జైలు గది ఊచల వెనక నిల్చోవడంతో వీడియో ముగుస్తుంది. కాగా, ఒబామా అరెస్టు తతంగం మొత్తాన్నీ ట్రంప్ చిరునవ్వుతో వీక్షించడం వీడియోలో చూడవచ్చు. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్.. ఏఐ సహాయంతో దీనిని తయారు చేశామనే విషయం చెప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతారహితంగా ప్రవర్తించారని పలువురు రాజకీయవేత్తలు విమర్శిస్తున్నారు.
Obama arrest
Trump social media
Donald Trump
Barack Obama
Truth Social
Artificial Intelligence
FBI
US Politics
Deepfake
Oval Office

More Telugu News