Tamil Nadu: భార్య చేతిలో మ‌రో భ‌ర్త బ‌లి.. సాంబారులో విషం క‌లిపి చంపిన అర్ధాంగి!

Wife Poisons Husband in Sambar in Tamil Nadu
  • త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలో దారుణం
  • వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని భార్య ఘాతుకం 
  • భర్తను సాంబారులో విషం క‌లిపి హతమార్చిన వైనం
  • మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో భార్య‌, ఆమె ప్రియుడు అరెస్ట్‌
దేశ వ్యాప్తంగా భర్తలను హతమారుస్తున్న భార్యల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా త‌మిళ‌నాడులో ఇదే కోవ‌కు చెందిన ఘటన‌ మరొకటి చోటుచేసుకుంది. త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పురి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని ఓ భార్య తన భర్తను సాంబారులో విషం క‌లిపి హతమార్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ధ‌ర్మ‌పురి జిల్లా అరూర్ ప‌రిధిలోని కీరైప‌ట్టి గ్రామానికి చెందిన ర‌సూల్ (35)కు భార్య అమ్ముబీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ర‌సూల్‌ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొన్ని రోజుల క్రితం అత‌డు ఉన్న‌ట్టుండి వాంతులు చేసుకొని, స్పృహ కోల్పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు సేలంలోని ఓ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.    

ఆసుప‌త్రిలో వైద్యులు ర‌సూల్ ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్షించి పురుగుమందు అవ‌శేషాలు గుర్తించారు. దీంతో అత‌ని కుటుంబీకులు భార్య అమ్ముబీపై అనుమానంతో ఆమె వాట్సాప్ చాట్‌ను ప‌రిశీలించారు. దాంతో ఆమె స్థానికంగా సెలూన్ షాప్ న‌డిపిస్తున్న లోకేశ్వ‌ర‌న్‌తో చాటింగ్ చేసిన‌ట్లు గుర్తించారు. 

అందులో.. నువ్వు ఇచ్చిన విషం ముందు దానిమ్మ జ్యూస్‌లో క‌లిపా. దాన్ని నా భ‌ర్త తాగ‌లేదు. దాంతో ఆహారంలో క‌లిపి తినిపించా అని అమ్ముబీ పేర్కొంది. ఈ క్ర‌మంలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ర‌సూల్ మృతి చెందాడు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి అమ్ముబీ, లోకేశ్వ‌ర‌న్‌ల‌ను శ‌నివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. 
Tamil Nadu
Rasool
wife kills husband
extra marital affair
poison in sambar
Ammu Bi
Lokeshwaran
Dharmapuri district
crime news
murder

More Telugu News