Sriganesh: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ పై దాడికి యత్నించిన దుండగులు

attempted attack on cantonment mla sri ganesh
  • వడ్డెర బస్తీ బోనాల ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన 
  • ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించిన సీఎంఓ
  • సీసీ టీవీ పుటేజీ ఆధారంగా వాహనాల నంబర్లతో ఆరుగురుని గుర్తించిన పోలీసులు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. మాణికేశ్వర్ నగర్ (వడ్డెర బస్తీ)లో నిన్న రాత్రి బోనాల సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తుండగా, సుమారు 50 మంది దుండగులు దాడికి యత్నించారు. ఈ మేరకు ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎంవో ఆరా తీసింది. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీగణేశ్ మాట్లాడుతూ.. వడ్డెర బస్తీలో జరిగే బోనాల ఉత్సవానికి వెళ్తుండగా సుమారు 20 బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు తన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని, తనను కారులో నుంచి కిందకు దిగాలని బెదిరించారని అన్నారు. అడ్డుకోబోయిన తన గన్‌మెన్ నుంచి ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారని తెలిపారు.

ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ జగన్ ఓయూ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి యత్నించిన వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి వాహనాల నంబర్ల ఆధారంగా ఆరుగురిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి వాకాటి శ్రీహరి ఓయూ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శ్రీగణేశ్ 2024 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉప ఎన్నికలకు ముందే ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు వరుసగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 
Sriganesh
Sriganesh MLA
Secunderabad Cantonment
Telangana Politics
Bonalu Festival
Attack Attempt
Congress Party
Vakati Srihari

More Telugu News