Pawan Kalyan: హరిహర వీరమల్లు సినిమాలో పవన్ స్వయంగా డిజైన్ చేసిన ఫైట్

Pawan Kalyan Designed Fight Scene in Hari Hara Veera Mallu Shot for 60 Days
  • సినిమాలో మొత్తం ఆరు ఫైట్ సీన్లు ఉన్నాయన్న డైరెక్టర్
  • ఎంటర్ ది డ్రాగన్ తరహాలో భారీ ఫైట్.. హీరోనే డిజైన్ చేశారని వెల్లడి
  • ఈ నెల 24న హరిహర వీరమల్లు విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాలలో ఫైట్స్ భిన్నంగా ఉంటాయని నిర్మాత ఏఎం రత్నం గుర్తుచేశారు.

‘‘పవన్ కల్యాణ్ హీరోగా, దర్శకుడిగా సత్యాగ్రహి టైటిల్ తో గతంలో ఓ సినిమాను ప్లాన్ చేశా. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నా. పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసి షూటింగ్ ప్రారంభించాం. కానీ ఆ తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పుడు ఆ సినిమా చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయం పవన్ కల్యాణ్ కు గుర్తుచేశా. దీనికి ఆయన నవ్వి.. ‘అవును సత్యాగ్రహి చేస్తే సూపర్ హిట్ అయ్యేది. అప్పుడు నేను సినిమాలు తీసుకుంటూ ఉండేవాడిని. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు’ అన్నారు’’ అని ఏఎం రత్నం చెప్పారు.

హరిహర వీరమల్లులో భిన్నమైన పోరాట సన్నివేశాలు మొత్తం ఆరు ఉన్నాయని డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పారు. ఈ సినిమాలో ఓ ఫైట్ అయితే ఎంటర్ ది డ్రాగన్ తరహాలో భారీగా ఉంటుందని, ఈ ఫైట్ సీన్ ను పవన్ కల్యాణ్ స్వయంగా డిజైన్ చేశారని చెప్పారు. ఈ ఒక్క ఫైట్ సీన్ షూట్ చేయడానికే ఏకంగా 60 రోజులు పట్టిందని డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారు. ఈ సన్నివేశాలలో డూప్ ను ఉపయోగించకుండా పవన్ కల్యాణ్ యాక్ట్ చేశారని, ఈ ఫైట్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమా కోసం తాను గుర్రపు స్వారీ, భరతనాట్యం, కథక్ నేర్చుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ లో మేకప్ కోసమే ఏకంగా ఐదు గంటలు పట్టేదని చెప్పారు.

Pawan Kalyan
Hari Hara Veera Mallu
AM Ratnam
Jyothi Krishna
Nidhi Agrewal
Fight Scene
Movie Promotion
Telugu Cinema
Action Sequence
Film Shooting

More Telugu News