Agriculture Minister: అసెంబ్లీలో రమ్మీ ఆడుతున్న వ్యవసాయ మంత్రి.. వీడియో ఇదిగో!

Agriculture Minister Manikrao Kokate Playing Rummy in Assembly
  • మహారాష్ట్ర మంత్రి నిర్వాకాన్ని బయటపెట్టిన ఎన్సీపీ లీడర్
  • రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రికి పట్టడంలేదని ఆగ్రహం
  • అప్పుడప్పుడైనా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలంటూ హితవు
మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం తీరిగ్గా అసెంబ్లీలోనే ఫోన్ లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నాడని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ తీవ్రంగా విమర్శించారు. వ్యవసాయ మంత్రి మాణిక్ రావ్ కోకటే రమ్మీ ఆడుతున్న వీడియోను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులో ఉందని, ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని రోహిత్ పవార్ ఆరోపించారు. పంట బీమా కోసం, రుణమాఫీ కోసం, పంటలకు మద్దతు ధర కోసం రైతులు పోరాడుతున్నారని ఆయన గుర్తుచేశారు.

ఈ సమస్యలతో అప్పులపాలైన రైతులు సగటున రోజుకు ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని రోహిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వ్యవసాయ మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఫోన్ లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నాడని మండిపడ్డారు. మొబైల్ ఫోన్ లో రమ్మీ ఆటను పక్కన పెట్టి అప్పుడప్పుడైనా పంట పొలాల్లోకి వచ్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Agriculture Minister
Rummy Game
Assembly
Rohit Pawar
Manikrao Kokate
Maharashtra
NCP
Farmers Suicide
Crop Insurance
Loan Waiver

More Telugu News